విజయవాడ, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): భవానీ భక్తులతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. శనివారం నుంచి దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. జనవరి 2వ తేదీ వరకు కొనసాగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. సుమారు ఐదు లక్షమంది భవానీలు, మరో రెండు లక్షల మంది సాధారణ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికే భవానీల రాక ప్రారంభం కావడంతో దేవస్ధానంలో సందడి వాతావరణం నెలకొంది.

అమ్మవారి ప్రధాన ఆలయం, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంతో పాటు మహామండపం, ఉపాలయాలు, కొండపైన, కింద ఉన్న దేవస్థాన పరిసరాలను విద్యుద్దీపాలతో శోభయామానం తీర్చిదిద్దారు అధికారులు. ఉత్సవాల బందోబస్తు కోసం సుమారు 4 వేల మందికి పైగా పోలీసులను నియమించారు. కొండ దిగువన రెండు కిలోమీటర్ల దూరం నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు క్యూలైన్లలోనికి ప్రవేశిస్తే నేరుగా దర్శనం చేసుకున్నాకే బయటకు వస్తారు. అంతరాలయం దర్శనం పూర్తిగా నిలిపేసి ముఖమండప దర్శనానికే ఆరు లైన్లలో భక్తులను అనుమతించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దేవస్థాన అధికారులు ఈసారి పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భవానీ భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఉచిత ప్రసాదాల పంపిణీ, అన్నదానం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కోటేశ్వరమ్మ ‘న్యూస్‌టైమ్’ ప్రతినిధికి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here