హైదరాబాద్, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, అలాంటి సందర్భంలో రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో ఉండాలా? మధ్యంతర బడ్జెట్ పెట్టుకోవాలా? అనే విషయంలపై అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.

పంచాయితీ రాజ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని వివరించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, వైద్య శిబిరాల నిర్వహణ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అనుగాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు ఎస్. నర్సింగ్ రావు, రామకృష్ణరావు, రాజేశ్వర్ తివారి, వికాస్ రాజ్, శాంతకుమారి, స్మితా సభర్వాల్, నీతూ ప్రసాద్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నదని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నదని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే ప్రజలందరికీ చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలు నిర్వహించాలని సీఎం చెప్పారు. ఫిబ్రవరిలో ఈ శిబిరాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ఆ ప్రొఫైల్ ఆధారంగా హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ తయారు చేయాలని సీఎం చెప్పారు.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లాంటి ఎత్తి పోతల పథకాలన్నీ ఈ దఫాలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టు పని ఎంత వరకు వచ్చింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? దానికి ఎంత డబ్బులు కావాలి? ఎక్కడైనా లోపాలున్నాయా? తదితర అంశాలపై ఓ నివేదిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో కూడా నీటి పారుదల శాఖకు సముచిత రీతిలోనిధులు కేటాయించడంతో పాటు, ఇతరత్రా మార్గాల ద్వారా కూడా నిధుల సేకరణ జరుపుతామని సీఎం చెప్పారు. 2019-20 బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

‘‘పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమగ్ర స్వరూపం తెలియదు. రాష్ట్రాలకు ఏమి ఇస్తారో వెల్లడి కాదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా? మధ్యంతర బడ్జెట్ పెట్టుకుని, కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అనుసరించే విధానానికి అనుగుణంగా తిరిగి బడ్జెట్ పెట్టుకోవాలా? అనే విషయంపై అధ్యయనం చేయాలి’’ అని సీఎం సీనియర్ అధికారులకు సూచించారు.

పెన్షన్లతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతీ హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాల్సి ఉన్నందున, బడ్జెట్లో కేటాయింపులు జరపాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం కోసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో మాట్లాడి సూచనలు తీసుకోవాలని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here