హైదరాబాద్, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): సాంకేతిక, నిర్వహణ కారణాల పేరిట దక్షిణ మధ్య (ఎస్సీ) రైల్వే శనివారం భారీగా ప్యాసింజర్ రైళ్లును రద్దు చేసింది. రద్దుచేసిన వాటిలో ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా ఉన్నాయి. సికింద్రాబాద్ – ఫలక్‌నుమా – ఉమ్ధానగర్, సికింద్రాబాద్ – బొల్లారం – మేడ్చల్ మధ్య రాకపోకలు సాగించే 31 డెమూ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే, ఈ రైళ్లను ఏకంగా మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్టు తెలపడం గమనార్హం.

జనవరి 1 నుంచి మార్చి 31 వరకు రైళ్లు రద్దు కానున్నాయట. మరి ఇన్నిరోజులు ప్రయాణీకుల పరిస్థితి ఏమిటన్నది మాత్రం అధికారులు ఆలోచించినట్లు లేదు. ఈ సర్వీసులపై ఆధారపడి అనేక మంది నిత్యం తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకుంటుంటారు. అయితే, ఇప్పుడు ఇలా నిర్వహణ, సాంకేతిక కారణాల పేరిట ఏకంగా మూడు నెలల పాటు సర్వీసులను రద్దుచేయడాన్ని ప్రయాణీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.