తిరుమల, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): తిరుమలేశుని సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వారాంతపు సెలవులు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే కొండపై యాత్రికుల కోలాహాలం కనిపించింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

శనివారం ఉదయం నాటి పరిస్థితిని బట్టి శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 14 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 71,951 మంది భక్తులు దర్శించుకోగా, 24,316 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు వచ్చినట్లు తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు మీడియాకు వెల్లడించారు.

ఇదిలావుండగా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న అధ్య‌య‌నోత్స‌వాలు డిసెంబరు 31వ తేదీన ముగియ‌నున్నాయి. డిసెంబ‌రు 7న ప్రారంభ‌మైన అధ్య‌య‌నోత్స‌వాలు 25 రోజుల పాటు జ‌రుగనున్నాయి. ఈ సంద‌ర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు.

ఈ 25 రోజుల్లో ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు. కాగా అధ్య‌య‌నోత్స‌వాల్లో తొలి 11 రోజుల‌ను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజుల‌ను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున‌ కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీ వరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్స‌వంతో ఈ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.