File photo
  • ఆంధ్రప్రదేశ్ హక్కులపై రాజకీయం

  • విభజన హామీల అమలుకు వత్తిడేదీ?

  • అంతా అధికార పార్టీదే తప్పని విమర్శలు

  • కాంగ్రెస్‌ను మించి తప్పుచేస్తున్న ‘కమలం’

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ఏ తప్పతే చేసిందో, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఇప్పటి అధికార పార్టీ బీజేపీ అంతకంటే పెద్ద పొరపాటే చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రం అవలంభిస్తున్న దాటవేత ధోరణి తెలుగు ప్రజలు అసహ్యించుకునేలా ఉంది.

బిల్లులో ఉందని ఒకరు, లేదని ఇంకొరు అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పడమే గానీ, అసలు ఉందో, లేదో బహిర్గతం చేస్తే పోతుంది. పార్లమెంట్ రికార్డులను తిరగేసి అసలు ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ బిల్లు ఆమోదించిన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏమన్నారు? దానికి అప్పటి విపక్ష పార్టీ బీజేపీ నేతలు ఎలా స్పందించారు? వంటి వివరాలను మీడియా ద్వారా వెల్లడిస్తే ప్రజల్లో నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయనడంలో సందేహం లేదు.

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని, కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తామని, పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని, అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని భరిస్తామని ఇలా రాష్ట్రానికి సంబంధించి విభజన బిల్లులో చర్చ సందర్భంగా అనేక హామీలు నాటి ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఊదరగొట్టింది. దీనిపై హస్తినలో భారీగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి ప్రచారం కూడా చేసింది. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం అంగీకరించారని వెల్లడించింది. నిజమే. ఆయన అంగీకరించవచ్చు.

ఇప్పుడు ఆయనేమీ ఆ విషయంలో మాటమార్చలేదు. ఇవ్వాల్సిన హోదా ఎలాగూ ఇవ్వలేదు, కనీసం ఇస్తామన్న ప్యాకేజీ అయినా సక్రమంగా ఇవ్వాలికదా? అన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకుల ప్రశ్న. హోదాకు బదులు ప్యాకేజీ అన్నప్పుడు వామపక్షాలు మినహా నేడు హోదా కావాలని గళం విప్పుతున్న పవన్ కల్యాణ్ గాని, ప్రతిపక్షంలో ఉన్న జగన్ గానీ పెద్దగా స్పందించలేదు.

ఎవరి రాజకీయాలు వారికుంటాయన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఏకాకిని చేసి ప్రజల్లో దోషిని చేయడం దేనికీ? జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా కాకపోయినా వేర్వేరుగా అయినా రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికీ నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి. కేవలం చంద్రబాబునాయుడు అసమర్ధత వల్లే రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆ రెండు పార్టీల అధినేతలు ఆరోపిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ అయితే ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశంపై కోపాన్ని ఆంధ్రాపై చూపించవద్దని ప్రధాని నరేంద్రమోదీని వేడుకున్నారు. ఇక్కడ తెలుగుదేశంపై కేంద్రానికి కోపం దేనికో అర్ధంకావడం లేదు. రాష్ట్ర హక్కుల సాధన విషయంలో పొరుగు రాష్ట్రాలను చూసైనా ఏపీ రాజకీయ పార్టీలకు కనువిప్పుకలగడం లేదు. కావేరీ జలాల వివాదం వచ్చినప్పుడు అటు కర్ణాటక, ఇటు తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాలూ ఏకతాటిపై తమ రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమించాయి. ఇక, ఒడిశా గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆ రాష్ట్రంలో ఏ పెద్ద సమస్య వచ్చినా అన్ని పార్టీలూ ఏకమవుతూనే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలులో కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా రాష్ట్రంలోని వామపక్షాలు మినహా ఏ పార్టీ ఏకతాటిపై నిలవలేదు. ఎన్నికలకు ముందు ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసేసింది. సభలో ఉంటే కేంద్రంపై నిరసన గళం వినిపించాల్సి వస్తుందని అనుకున్నారో ఏమో ఆ పార్టీ అధినేత. పార్లమెంట్ బయట ఉన్నా కూడా తమ మద్దతు అవిశ్వాస తీర్మానానికి ఉంటుందని చావుకబురు చల్లగా చెప్పారు జగన్. ఇక, దాదాపు నాలుగేళ్లపాటు తెలుగుదేశంతో సఖ్యత కొనసాగించిన పవన్ కల్యాణ్ జనసేన బలోపేతం పేరిట ఒక్కసారిగా ఆ పార్టీని తిట్టడం పనిగా పెట్టుకున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబునాయుడే కారణమన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. హోదా ఇచ్చేది తను 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన బీజేపీయేనని ఆయనకు పాపం తెలియకపోయి ఉండవచ్చు. అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో లేకపోయినా వెలుపల నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్‌ కంటే జనసేన పార్టీ ఏ విషయంలో గొప్ప? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేలా పవన్ తన వైఖరిని ప్రదర్శించుకున్నారు.

పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ట్వీట్ చేసి వదిలేశారే తప్ప తన పార్టీని నిరసన కార్యక్రమాలు చేపట్టమని పిలుపునివ్వలేకపోయారు. దీన్ని బట్టి కేంద్రంతో ఆయన దోస్తీ కొనసాగుతుందనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. మరోవైపు, పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసుపై ఆయన ఎందుకు మాట్లాడనిది చెబుతున్న తీరు విస్తు కలిగిస్తుంది. ఎందుకు టిడిపికి దూరంగా వెళ్లరాదో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పాలని అనడం చిత్రంగా అనిపిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఒక విధానం అంటూ ఉంటుంది.

ఆయా అంశాలపై నిర్దిష్ట వైఖరి తీసుకుంటుంది. కానీ, పవన్‌ కళ్యాణ్‌‌లో మాత్రం ఆ క్లారిటీ వచ్చినట్లు కనిపించలేదు. కాకపోతే, టీడీపీపై కాస్త ఘాటు పెంచారు. బీజేపీపై అంత ఘాటు చూపలేదు. ఆ తేడా అనువనువునా కనిపిస్తోంది. బహుశా రెండు పార్టీలకు ఒకేసారి దూరం అవడం, రెండు పార్టీల నేతలతో ఒకేసారి విమర్శిస్తుంటే వాటిని తట్టుకోవడం కష్టం అనుకున్నారేమో తెలియదు కానీ, ట్వీట్లలో, ప్రసంగాలలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఏది ఏమైనా ప్రత్యేక హోదా ఉద్యమంలో పవన్‌ కళ్యాణ్‌ ఊగిసలాట రాజకీయం నుంచి బయటపడడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.