అమరావతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ‘నీరు-ప్రగతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. 2018లో అద్భుతంగా పనిచేశామని, అన్ని శాఖల్లో మంచి పురోగతి సాధించామన్నారు.

రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ సదుపాయాలు కల్పించామని, ప్రజల ఇబ్బందులను తొలగించామని సీఎం తెలిపారు. 2018లో చేసిన కృషి ఫలితాలు 2019లో వస్తాయని, తొలి 6 నెలల్లోనే 11.5% వృద్ది సాధించామన్నారు. ఈ ఏడాది వివిధ రంగాలలో 675పైగా అవార్డులు సాధించామని, కృషి కళ్యాణ యోజనలో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలవడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు. విజయనగరం, విశాఖపట్నం, కడప జిల్లాలు ఈ ఘనత సాధించాయని చెప్పారు.

ముందుచూపు, నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, డిజిటలైజేషన్, ఉబరైజేషన్, కన్వర్జెన్స్, టెక్నాలజీ, ట్రాన్స్‌ఫర్మేషన్ (వయాడక్ట్)తోనే ఇన్ని అవార్డులు సాధించామని చెప్పుకొచ్చారు. ‘‘నేను బృంద నాయకుడిని మాత్రమే. మొత్తం ఘనత బృందానికే చెందుతుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

‘‘2019లో అందరికీ శుభం జరగాలి. తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్‌వైపే చూడాలి. విశాఖలో మెడ్ టెక్ జోన్ దేశానికే తలమానికం. 175 నియోజకవర్గాలలో యువత ఉపాధి కోసమే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేశాం. 5 వేల మంది కౌలు రైతులకు పంటరుణాలు మంజూరుచేయడం ద్వారా దేశంలోనే చరిత్ర సృష్టించాం’’ అని చెప్పారు.

రాష్ట్రంలో కౌలు రైతులు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. పంట బీమా రాష్ట్ర ప్రభుత్వ వాటా వెంటనే విడుదల చేయాలని, కేంద్రం వాటా విడుదల చేసేలా ఒత్తిడి తేవాల్సి ఉందన్నారు. రబీలో వ్యవసాయంలో వృద్ది మరింత పెరగాలని సీఎం ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తిరుగులేని శక్తిగా ఎదగాలన్నారు.

ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా 2018లో జరిగిన అభివృద్ధిని వివరించిన సీఎం 2019లో చేయాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. 2018లో చేసిన కృషికి 2019లో ఫలితాలు వస్తాయన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 11.2 శాతం వృద్ధి సాధించామని, వివిధ రంగాల్లో 675కి పైగా అవార్డులు సాధించామని చెప్పారు.