గుంటూరు, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి మరికొద్ది గంటల్లో స్వాగతం పలుకుదామన్న ఉత్సాహంతో ఉన్న ఆ నలుగురు విద్యార్ధులను కారు ప్రమాదం కాటేసింది. గుంటూరు లాల్‌పురం వద్ద గుంటూరు- చిలకలూరిపేట రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొని అదే వేగంతో ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారు ఢీకొట్టిన వేగానికి లారీ సైతం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు.

ఒకే కారులో వీరు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా విజయవాడ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ధనుష్‌ (గుంటూరు విద్యానగర్‌), సాయిరామ్‌ (పెద్దకూరపాడు మండలం కమ్మంపాడు), కోటేశ్వరరావు (శావల్యపురం), కపూర్‌ మృతిచెందారు. మృతులంతా 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి. ఇదిలావుండగా, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన మరో రెండు రోడ్డు ప్రమాదాలలో కూడా 14 మంది దుర్మరణం పాలయ్యారు.

ఒడిశాలోని రాయగఢ జిల్లా కాశీపూర్‌ సమీపంలోని తొయాపుట్‌ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రమాద స్థలిలోనే ముగ్గురు మృతిచెందగా రాయగఢ ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢలోని చొయితి ఉత్సవాల్లో పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గుజరాత్‌ కచ్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది దుర్మరణం పాలయ్యారు. కచ్‌ జిల్లాలోని భచౌ ప్రాంతానికి సమీపంలో రెండు ట్రక్కులు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఉప్పును తరలిస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ట్రక్కును బలంగా ఢీకొంది. అదే సమయంలో వెనక నుంచి మరో భారీ వాహనం ఈ వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో పది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

వీరంతా గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతానికి వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రమాదం గురించి తెలుసుకొని బాధితులకు ప్రభుత్వం తరఫున తగిన సహాయక చర్యలు అందించాల్సిందింగా జిల్లా అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here