హైదరాబాద్, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం సోమవారంతో ముగిసింది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి అమరావతి నుంచే ఏపీ రాష్ట్ర హైకోర్టు పనిచేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు తరలివెళ్లారు. బస్సుల్లో వీరంతా అమరావతికి బయలుదేరారు.

అమరావతి పరిధిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం వేసిన రిట్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టలేమని సోమవారం ఉదయం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినప్పటికీ అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ స్పష్టం చేశారు. జనవరి 2న సాధారణ విచారణ చేపడతామని తెలిపారు.

దీంతో ఇక చేసేది లేక ఏపీ హైకోర్టుకు కేటాయించిన ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది తమ తమ ఫైళ్లను తీసుకుని అమరావతికి బయలుదేరారు. మంగళవారం నుంచి అమరావతిలోని తాత్కాలిక భవనంలో ఏర్పాటుచేసిన హైకోర్టు నుంచి వీరంతా విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లు కావస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టును అయిదు రోజుల కిందట విభజించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here