తిరుమల, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ ఫ్యాక్టరీ వస్తే మొక్కుతీర్చుకుంటానని చెప్పిన తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యడు సీఎం రమేశ్‌ సోమవారం తిరుమలేశుని సేవలో తరించారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు.

ఆదివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకున్న ఆయన సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. తన చిరకాల కోరిక అయిన కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి కేంద్రం స్పందించకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవ తీసుకుని ఇచ్చిన హామీని శంకుస్థాపన రూపంలో నెరవేరడంతో తలనీలాలను సమర్పించానని సీఎం రమేష్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంగతిని పార్లమెంటులో ప్రస్తావిస్తానని, సొంత జిల్లాలో పరిశ్రమ నిర్మించేందుకు కృషి చేయాల్సిందిపోయి ప్రతిపక్ష నాయకుడు జగన్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను, చట్ట ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోదీ సర్కారు అనుసరిస్తున్న తీరు గర్హనీయమన్నారు.