నెల్లూరు, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): జిల్లాలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు కండువాలు కప్పి టీడీపీ నుంచి వందల కుటుంబాలు వచ్చి చేరుతున్నాయని విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం చూసి చివరికి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది.

తమాషా ఏంటంటే ఇటు టీడీపీలో చేరుతున్నది వైకాపా కార్యకర్తలే. అటు వైకాపాలో చేరుతున్నది కూడా వైకాపా కార్యకర్తలు కావడమే. రోజూ వందల కుటుంబాలు చేరిపోతున్నాయని ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటున్నారు కానీ వారిలో ఒక్క టీడీపీ కార్యకర్త ముఖం కూడా లేకపోవడం ఆసక్తికర అంశం. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుడు, ముఖ్యనాయకులు పెద్దసంఖ్యలో తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే.

కొందరు టీడీపీ నాయకులు కూడా వైకాపాలో చేరుండొచ్చు కానీ గత ఎన్నికల సమంలో వైకాపా అభ్యర్థి కోసం పనిచేసిన ముఖ్యనాయకులు అనేక మంది ఆ పార్టీని ఖాళీ చేసి నేడు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అండగా నిలవడం ప్రజలందరూ చూస్తూనేవున్నారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నా ఇప్పటికీ ఏదో ఒక ప్రాంతం నుంచి ముఖ్య వైకాపా ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతూనేవున్నారు.

మరోవైపు, సోమిరెడ్డి ఈ రోజుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. 40 ఏళ్లుగా సోమిరెడ్డి కుటుంబాన్ని జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే వారిని అవినీతిపరులుగా, అక్రమాలు చేసేవారిగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తీరుకు విసిగి వారంతా సోమిరెడ్డికి అండగా నిలుస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here