• తలాక్‌ బిల్లును సెలక్షన్‌ కమిటీకి పంపించాలని డిమాండ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): కేంద్ర ప్రభుత్వం తనకున్న సొంత బలంతో లోక్‌సభలో ఆమోదించిన ‘ముమ్మారు తలాక్‌’ వ్యతిరేక బిల్లుపై రాజ్యసభలో మాత్రం రచ్చ తప్పడం లేదు. సోమవారం ఈ బిల్లుపై ఎలాంటి చర్చ జరగకుండానే రాజ్యసభ వాయిదా పడింది. ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లు సోమవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. అయితే, ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును అనుమతించేందుకు కాంగ్రెస్‌ సహా 10 విపక్షాలు నిరాకరించాయి. బిల్లును సెలక్షన్‌ కమిటీకి పంపించాల్సిందిగా ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

బిల్లును మరింత పరిశీలించేందుకు సెలక్షన్‌ కమిటీకి పంపాల్సిందిగా రాజ్యసభ ప్రతిపక్ష నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ కోరారు. ‘‘ఇది చాలా ప్రాముఖ్యమైన బిల్లు. కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలపై ఈ బిల్లు అనుకూల‌/ప్రతికూల ప్రభావం చూపుతోంది. అటువంటి ముఖ్యమైన బిల్లును సెలక్షన్‌ కమిటీ పరిశీలించకుండా ఆమోదింపజేయాలని చూడటం తగదు’’ అని ఆజాద్‌ పేర్కొన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా తలాక్‌ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత దేరేక్‌ ఓ బ్రెయిన్‌ తెలిపారు.

తలాక్‌ బిల్లుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కానీ కాంగ్రెస్‌ కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ అన్నారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్‌ మద్దతు తెలిపిందని, కానీ ఇప్పుడు రాజ్యసభలో మాత్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ముస్లిం మహిళల హక్కులకు సంబంధించిన ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలిసి రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

దీంతో పాటు కావేరి జలాలు, ఇతర అంశాల విషయంపై నేతలు ఆందోళనలకు దిగడంతో రాజ్యసభ జనవరి రెండో తేదీకి వాయిదా పడింది. మరోవైపు, ముమ్మారు తలాక్‌ చెప్పడం నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును కేంద్రం రాజ్యసభకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సోమవారం ఫోన్‌ చేశారు. రాజ్యసభలో తలాక్‌ బిల్లును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఏపీ రాజధాని పరిధిలోని ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఇరువురు నేతలకూ ఫోన్ చేసిన చంద్రబాబు ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలని, వారి హక్కులను కాపాడాలని కోరారు. బిల్లును అడ్డుకునేందుకు భాజపాయేతర పక్షాల సభ్యులందరినీ ఏకం చేయాలని విజ్ఞప్తి చేశారు. భాజపా ముస్లిం వ్యతిరేక చర్యలను గట్టిగా ప్రతిఘటించాలని ఇరువురు నేతలనూ కోరారు. అంతకుముందు ఈ అంశంపై పార్టీ ఎంపీలతో మాట్లాడిన సీఎం తమ సభ్యులంతా హాజరయ్యేలా విప్ జారీ చేయాలని ఆదేశించారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు రాజ్యసభలో ఈ బిల్లును పాస్ కానివ్వబోమని తెదేపా ఎంపీలు ఢిల్లీలో స్పష్టం చేశారు. తలాక్ బిల్లు రాజ్యసభకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. మరోవైపు, భాజపా నేతలు సమావేశమయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. మరోవైపు విపక్ష పార్టీల నేతలు సైతం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

ఎట్టి పరిస్థితుల్లో ముమ్మారు తలాక్‌ బిల్లును రాజ్యసభలో పాస్‌ కానివ్వబోమని తెదేపా ఎంపీలు స్పష్టంచేశారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే తమ పార్టీ సభ్యులందరికీ సభకు రావాలని విప్‌ జారీ చేశామన్నారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబడతామని చెప్పారు. తలాక్‌ బిల్లును చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదని ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు.

రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకుని తీరుతామని చెప్పారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని తెదేపా డిమాండ్‌ చేస్తోందని మరో ఎంపీ నారాయణ చెప్పారు. స్త్రీలకు న్యాయం చేయడం కోసం పురుషులకు అన్యాయం చేయొద్దని, స్త్రీ, పురుషులకు సమాన న్యాయం జరిగేలా బిల్లు ఉండాలని ఆయన కోరారు. తలాక్ బిల్లు రాజ్యసభకు వస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును అనుమతించేది లేదని కాంగ్రెస్‌ సహా 10 విపక్షాలు తేల్చి చెప్పేశాయి. తలాక్‌తో ముస్లిం మహిళలు ఎంతగానో నష్టపోతున్నారని వివరించారు.