• పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు అన్యాయం

పల్లె జీవులకు ఉపాధి కల్పించాలి, ఉపాధి లేక ఏ ఒక్కరూ ఆకలిబాధతో అలమటించకూడదు, పట్టణాలకు వలసెల్లకూడదు, ఇలాంటి లక్ష్యాలతో ఉపాధి హామీ చట్టాన్ని తయారుచేశారు. ఇంతటి గొప్ప చట్టాన్ని కేంద్రమే నీరుగార్చుతోంది. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు చూస్తే ప్రభుత్వం ఉద్దేశమేంటో అర్థమవుతోంది. ఒకవైపు ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా కేంద్ర ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావట్లేదు. ఒకపక్క కరువు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది.

ఉపాధి లేక ప్రజలు పట్టణాలకు వలసెల్లిపోతున్నారు. కూలీలు వలసలు పోవడం ఈనాడు కొత్తేమీ కాదు. గ్రామాల్లో ఉపాధి లేక వేలాది మంది పట్టణాలకు వెళ్లిపోవడం దశాబ్దాలుగా చూస్తున్నాం. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలన్న సదుద్దేశంతో యుపిఎ హయాంలో వామపక్ష పార్టీల ఒత్తిడిమేరకు తీసుకొచ్చిన అద్భుత చట్టమే ఉపాధి హామీ యాక్ట్‌. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గ్రామాల్లో కూలీల ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. వలసలకు కొంతమేర అడ్డుకట్టపడింది.

ఇంతటి విశేషమైన పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులే ఉదాహరణ. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కోసం ప్రభుత్వం 41,371 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. తద్వారా 239 కోట్ల ఉపాధి పనిదినాలు కల్పించినట్లైంది. ఈ సంవత్సరం 217 కోట్ల పనిదినాలు కల్పించాలన్నదే లక్ష్యంగా బడ్జెట్‌ను 38,500 కోట్ల రూపాయలమేర కేటాయించారు. దీన్నిబట్టి 2871 కోట్ల రూపాయలను తగ్గించినట్లైంది.

ఒకపక్క దేశ జనాభా ఏటా కోటికి పైగా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఉపాధి అవకాశాలు మాత్రం మెరుగుపడట్లేదు. ఇలాంటి సమయంలో ఉపాధి హామీ పనిదినాలు కొద్దిమేరకైనా పెరగాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం పనిదినాలను కుదించడం, బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో మొదటి, చివరి త్రైమాసికాల్లో జరిగిన ఉపాధి హామీ పనిదినాలను బట్టి ప్రభుత్వం 2017 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కోత విధించింది.

అయితే 2, 3 త్రైమాసికాల్లో జరిగిన పనిదినాల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. కానీ ప్రభుత్వం మాత్రం 22 కోట్ల పనిదినాలను తగ్గించడం ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజానికి గత ఏడాది ఏప్రిల్-జూన్‌ త్రైమాసికంలో విపరీతమైన ఎండల మూలంగా పశ్చిమ, ఉత్తర భారతదేశంలో ఉపాధి పని దినాలు భారీగా తగ్గాయి. దీన్నిబట్టి ఈ త్రైమాసికంలో పనులు తగ్గుతాయని అంచనావేసిన ప్రభుత్వం బడ్జెట్‌లో కోత విధించింది. ఇక కేంద్ర ప్రభుత్వం పనిదినాలకు కేటాయించాల్సిన నిధులనూ రాష్ట్రాలకు త్వరితగతిన విడుదల చేయడకపోవడం మరో సమస్యను క్రియేట్ చేస్తోంది.

తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. పైగా కూలీలకు పనిచేసిన ఎన్నో నెలలకు వేతనాలు అందుతుండడంతో వారు ఉపాధి హామీ పనులంటేనే కొంత విముఖత చూపుతుండడం గమనార్హం. ఇలా ఎన్నో రకాలుగా ఉపాధి హామీ చట్టం అమలులో కేంద్రం విఫలమవుతూ చివరకు బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here