• పొగమంచు కారణంగా నిలిచిపోయిన విమానాలు

న్యూఢిల్లీ, జనవరి 8: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పొగమంచు కష్టాలు తప్పలేదు. గడచిన వారం పది రోజుల నుంచి హస్తిన వాసులు పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు, రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

విమానాశ్రయంలో పదుల సంఖ్యలో విమానాల రాకపోకలు స్తంభించడంతో భారీగా ప్రయాణికులు నిలిచిపోయారు. పొగమంచులో రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో మంగళవారం ఉదయం నుంచి ఇక్కడి నుంచి బయలుదేరే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులన్నిటినీ అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానాలపైనా ఈ ప్రభావం పడింది. కొన్ని విమానాలు మాత్రమే ఇక్కడ ల్యాండ్‌ కాగలిగాయి.

దీంతో ప్రయాణికులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. అయితే మంగళవారం విమానాలేవీ రద్దు కాలేదని అధికారులు ప్రకటించారు. ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రత అత్యల్పంగా 5.7 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. డిసెంబరు 24న కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు, రైళ్ల రాకపోకలపైనా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపించింది.

ఢిల్లీకి వెళ్ళాల్సిన 56 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 20 రైళ్ల సమయాన్ని అధికారులు మార్చారు. 15 రైళ్లు రద్దయినట్లు ఉత్తర రైల్వే అధికారులు వెల్లడించారు. ఆది, సోమవారాల్లో కూడా పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం విధితమే. దాదాపు 270 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 40 విమానాలను వేరే విమానాశ్రయాలకు మళ్లించారు.

మరికొన్ని రద్దయ్యాయి. మంగళవారం ఉదయం ప్రయాణాల కోసం త్వరగా విమానాశ్రయాలకు చేరుకున్న వారితో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడ పడిగాపులు గాస్తున్న ప్రయాణికులు తమ పరిస్థితిని ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.