నెల్లూరు, జనవరి 8 (న్యూస్‌టైమ్): గత నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఆమంచర్లలో మంగళవారం ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలసి డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆదాల మీడియాతో మాట్లాడారు.

‘‘మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వాలు ఏ విధంగా పని చేశాయి? గత నాలుగున్నర ఏళ్లు ఏ విధమైన అభివృద్ధి జరిగింది? అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరంతా మనసుపెట్టి ఆలోచిస్తే చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. గత 70 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేసుకున్నాం. ఒక్క ఆమంచర్ల గ్రామంలోనే 577 మందికి పెన్షన్లు ఇచ్చాం. 300 మందికి ఇళ్లు మంజూరు చేశాం. మరో 300 మందికి దరఖాస్తు చేశాం. ఆమంచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో పది కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేశాం. 15 లక్షలు రూపాయలతో పంచాయతీ భవనాన్ని కట్టుకున్నాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. నీరు చెట్టు కింద రెండు కోట్ల రూపాయలతో పనులు చేసాం. భూగర్భ డ్రైనేజీ అనేది పట్టణాల్లో మాత్రమే ఉంటుంది. అలాంటిది ఆమంచర్లకు మంజూరు చేశాం. 7.8లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశాం. త్వరలోనే పనులు మొదలు కానున్నాయి. భూగర్భ డ్రైనేజీ వస్తే దోమలు, జబ్బులు ఉండవు. అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. 17 గ్రామాలలో సీసీ రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చాం. రానివారికి ఫిబ్రవరిలో ఇస్తాం. నియోజకవర్గంలోని 26 వార్డులో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. అలాగే నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశాం’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, సీనియర్ నేత ఆనం జయకుమార్ రెడ్డి, కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, హరిబాబు యాదవ్, వెంకటేశ్వర్లు నాయుడు, జన్ని రమణయ్య తదితరులు మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో పాముల హరి గంగాధర్, నరసింహరావు, అవినాష్. జీవన్ ప్రసాద్, ఎంపీడీవో వసుమతి, వాదనల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here