శ్రీకాకుళం, జనవరి 8 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగించనున్నారు. ఈ నేపధ్యంలో ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో నిర్మిస్తున్న పైలాన్ పనులు పూర్తయ్యాయి. వైఎస్‌ఆర్‌, షర్మిల పాదయాత్ర సందర్భంగా నిర్మించిన విజయ వాటికల సమీపంలోనే ఈ పైలాన్‌ను నిర్మించారు. నాలుగు పిల్లర్లు, మూడు అంతస్తులతో నిర్మించిన ఈ స్థూపం పై అంతస్తులో వైఎస్ఆర్‌, రెండో అంతస్తు నాలుగు వైపుల జగన్‌ ఫోటోలను ఏర్పాటు చేశారు.

13 జిల్లాల మీదుగా సాగిన పాదయాత్రకు గుర్తుగా 13 మెట్లతో ఈ స్థూపాన్ని నిర్మించారు. మరోవైపు, సీఎం చంద్రబాబునాయుడు, అతని అనుచరగణం చేసిన అవినీతి, అక్రమాలను ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ఢిల్లీ వేదికగా అటు ప్రత్యేక హోదాపై, ఇటు టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ఆ పార్టీ ఎంపీలు, సీనియర్‌ నాయకులు గళం వినిపిస్తున్నారు. ‘చంద్రబాబు ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ అనే పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్‌ నేతలు ఢిల్లీలో సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. కాదేదీ అవినీతికి అనర్హమన్నట్టుగా చంద్రబాబు దోపిడీ పాలన సాగుతోందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నిజ స్వరూపం చెప్పడానికే ఈ పుస్తకమని తెలిపారు. చంద్రబాబు, అతని అనుచరులు అమరావతి నుంచి పోలవరం నిర్మాణం వరకు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కార్యకలాపాల కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి అన్నారు. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డపై అప్పుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ‘కాగ్‌’ స్పష్టం చేసిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.

రాఫేల్‌ కంటే అమరావతి స్కామ్‌ పెద్దదని వాటర్‌మాన్‌ రాజేంద్ర సింగ్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 600 హామీలిచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక్కటీ కూడా అమలు చేయలేదని రాజ్యసభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి పాలనపై సాక్షాత్తూ ఇద్దరు చీఫ్‌ సెక్రటరీలు బహిరంగంగా విమర్శలు చేశారని చురకలంటించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here