• జగన్‌కు అభివృద్ధి కనిపించడం లేదు: దేవినేని

  • మంచిని అంగీరించలేని మానసిక వ్యాధి పట్టుకుందని విమర్శ

అమరావతి, జనవరి 8 (న్యూస్‌టైమ్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీ తప్ప, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన మంచిని అంగీకరించలేని మానసిక‌ వ్యాధి జగన్‌ను పీడిస్తోందని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరంలో రికార్డు స్థాయిలో పనులు జరుగుతుంటే, జగన్ ఓర్వలేకపోతున్నాడని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైరెక్షన్‌‌లో సీఎం చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ. 10 వేల కోట్లు ఖర్చుపెడితే, రూ. 25 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపించడం ఏంటని ప్రశ్నించారు. ‘‘పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టు గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కడం చాలా సంతోషంగా ఉంది. 32 వేల 315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం గొప్ప విషయం. దేశమంతా గర్వపడి, తెలుగు వాడి సత్తాను అభినందిస్తుంటే జగన్ ఓర్వలేక పోతున్నాడు’’ అని వ్యాఖ్యానించారు.

గిన్నీస్ రికార్డు పేరుతో నాటకం అంటూ తన అవినీతి పత్రికలో విషం ‌చిమ్మడం‌ దుర్మార్గమని ధ్వజమెత్తారు. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు, 24గంటల ‌శ్రమను జగన్ తన అక్కసు రూపంలో అవమానించాడని పేర్కొన్నారు. మంచిని కూడా అంగీకరించలేని మానసిక‌వ్యాధితో జగన్ బాధ పడుతున్నాడని, చంద్రబాబును తిట్టకుండా, సీఎం సీటుపై కలలు కనకుండా జగన్‌కు రోజు గడవదని ఎద్దేవాచేశారు. ఎన్ని‌ అవాంతరాలు ఎదురైనా చంద్రబాబు నిధులు కేటాయించి పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారని, కేంద్రం నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా జగన్ నోరు తెరవడని, కోర్టులో కేసులు కూడా వేయించి పోలవరం అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేశాడని చెప్పారు.

ఇంత నీచంగా దిగజారి జగన్ వ్యవహరించి తన నైజాన్ని బయట పెట్టుకున్నాడని, సీఎం పదవి పిచ్చి పట్టిన జగన్‌కు ఆ కుర్చీ తప్ప మంచి ఏది కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతుందని, మోడీని కానీ, కేంద్రంను కానీ జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. మోదీ, కేసీఆర్‌తో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తూ ఎపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు.

అవినీతి కేసులో ఎ1, ఎ2 ముద్దాయిలుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి పోలవరంపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పుస్తకాలు వేస్తూ దష్ప్రచారం చేస్తున్నారని, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు, ఇంజనీర్లు, నిపుణులు సమక్షంలో పనులు‌ చేశామని, 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే జగన్ తన పత్రికలో పూత అని రాసాడని, తన స్వార్ధం కోసం గిన్నీస్ రికార్డ్‌ను కూడా తప్పు పట్టేలా పిచ్చి కథనాలు రాయించాడని తెలిపారు.

‘‘జగన్… ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? పట్టిసీమ లేకపోతే నేడు డెల్టా లేదు. దానిని కూడా నువ్వు సమర్ధించ లేదు. కృష్ణా డెల్టాలో రెండు పంటలతో పాటు, రాయలసీమకు నీరు ఇచ్చి చూపాం. రాయలసీమ రతనాల సీమ చేసేందుకు సీఎం తపన పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో జల హారతి ఇచ్చి చంద్రబాబు నీటిని తీసుకువస్తున్నారు. చంద్రబాబు ప్రణాళికల వల్లే నేడు అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. 10 వేల 449 కోట్ల రూపాయల పోలవరం పనులు చేస్తే 25 వేల కోట్లు అవినీతి జరిగిందని అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. మోదీ, కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

‘‘నీలాంటి వాళ్లు ఎంతమంది అడ్డుపడినా చంద్రబాబు పోలవరం పూర్తి చేసి రైతాంగానికి కానుకగా అందిస్తారు’’ అని దేవినేని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here