నెల్లూరు, జనవరి 8 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఉదయం నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పార్కులు, ఖాళీ స్థలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ విడుదల చేసిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకంపై స్పందించిన మంత్రి నారాయణ జగన్ విడుదల చేసింది నిందలు పుస్తకం, తిట్ల దండకమన్నారు. పెద్ద మోదీ డైరెక్షన్లో చిన్న మోదీ రాష్ట్రంపై విషం కక్కుతున్నారని వ్యాఖ్యానించారు.

కేసుల మాఫీ కోసం జగన్ మోదీ పాదాక్రాంతం అయ్యాడని విమర్శించారు. అవినీతిపై జగన్ మాట్లాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని, రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతున్నారని, జగన్ కేసుల వ్యవహారం కోర్టులో ట్రయల్స్‌లో ఉందని, ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త నాటకానికి జగన్, మోదీ తెరతీశారని పేర్కొన్నారు.

అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా ఉన్నారని, వారి భూముల విలువ పది రెట్లు పెరిగిందని, అమరావతి నిర్మాణంలో జరుగుతున్న పురోగతి జగన్ కలలో కూడా ఊహించలేదని, అందుకే అమరావతిలో అవినీతి జరిగిందని అసత్య ప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. రాష్ట్ర రాజధానిపై జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే నీతి అయోగ్ ఫాస్ట్ చేసిన నిధులను వెంటనే విడుదల చేయమని మోదీని నిలదీయాలన్నారు. అవినీతిలో కూరుకు పోవడానికి ఇది వైఎస్ ప్రభుత్వం కాదని, జగన్ పుస్తకం పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here