• ప్రతిష్టాత్మకమైన ‘ఫీల్డ్స్‌’ పతకం

ఫిన్లాండు, జనవరి 8: ఫీల్డ్స్‌ పతకం ప్రపంచంలోని యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి. గణిత శాస్త్రంలో నోబెల్‌ బహుమతిగా దీనిని పరిగణిస్తారు. 40 ఏళ్లు పైబడని ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు గణిత శాస్త్రవేత్తలకు, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఇంటర్‌నేషనల్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ మేథమేటీషీయన్స్‌(ఐసీఎం) సందర్భంగా ఈ పురస్కారం లభిస్తుంది. పతకంతోబాటు 15,000 కెనేడియన్‌ డాలర్లు కుడా ఇవ్వడం జరుగుతుంది.

ఈ బహుమతి అధికారిక నామం ‘ఇంటర్నేష్నల్‌ మెడల్‌ ఫర్‌ ఔట్‌ స్టాండింగ్‌ డిస్కవరీస్‌ ఇన్‌ మాథమాటిక్స్‌’ అయినప్పటికీ, దీనిని స్థాపించడానికి కృషి చేసి, అర్ధిక వనరులను సమకూర్చిన జోన్‌ చార్ల్స్‌ ఫీల్డ్స్‌ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్స్‌ పతకంగా గుర్తింపు పొందింది. ఫీల్డ్స్‌ పురస్కారం మొట్టమొదటి సారి 1936లో ఫిన్లాండుకు చెందిన లార్స్‌ అల్ఫోర్స్‌, అమెరికాకు చెందిన జెస్సి డగ్లస్‌లకు లభించింది.

రెండో ప్రపంచ యుధ్ధం కారణంగా ఐసీఎం జరగకపోవడం చేత 1950 వరకు ఈ బహుమతి ఎవ్వరికీ దక్కలేదు. అటు తరువాత ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతూ వచ్చింది. 1923లో టొరొంటో విశ్వవిద్యాలయం చేత స్థాపించబడిన కమిటీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌కి ఫీల్డ్స్‌ అధ్యక్షత వహించారు. ఫీల్డ్స్‌ పతకం ప్రస్తావన మొదటిసారిగా ఫిబ్రవరి 24, 1931న జరిగిన కమిటీ సమావేశంలో వచ్చినట్టుగా నమోదు చేయబడి ఉంది. ప్రారంభంలో రెండు పతకాలు, 2,500 నగదు బహుమానంగా నిర్ణయించడం జరిగింది. ఆ తరువాత ఫ్రాన్స్‌, జర్మనీ, ఇతర దేశాలలోని గణిత శాస్త్రవేత్తల బృందాల నుండి ఈ ఆలోచనకు మద్దతు లభించింది. ఈ విధంగా ఫీల్డ్స్‌ తన ఆలోచనను అమలుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసాడు. కానీ తన ప్రణాళిక కార్యరూపం దాల్చేముందే ఆగస్టు 9, 1932న ఫీల్డ్స్‌ కన్ను మూసాడు. వీలునామాలో తన ఆస్తిలో నుండి 47,000 ఈ పతకం కొరకు ఫీల్డ్స్‌ సమకూర్చాడు.

ఈ పతకం ఏ ఒక్క వ్యక్తికిగానీ, దేశానికిగాని సంబంధం లేకుండా తగినంతవరకు నిష్పాక్షిక స్వభావం కలిగి ఉండాలని ఫీల్డ్స్‌ భావించాడు. అయినప్పటికీ ఈ పతకం పేరు ఫీల్డ్స్‌ పతకంగా నిలిచిపోయింది. ఫీల్డ్స్‌ పతకాన్ని కెనడాకు చెందిన రోబర్ట్‌ టేట్‌ మెక్కెంజీ అనే శిల్పి రూపొందించాడు. ఈ పతకం 9 సెంటిమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. పతకానికి ఒక వైపు కుడి వైపుకి తిరిగి ఉన్న గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడెస్‌ ముఖం, గ్రీకు అక్షరాలలో అతని పేరు, టేట్‌ మెక్కెంజీ సంతకం, రోమన్‌ సంఖ్యామానంలో తేదీ లాటిన్‌ అక్షరాలలో సామెత ఉంటాయి. పతకానికి మరోవైపు లాటిన్‌ భాషలో ‘ప్రపంచమంతటి నుండి హాజరు అయిన గణిత శాస్త్రవేత్తలు అత్యుత్తమ రచనలకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు’ అని ఉంటుంది. చివరిగా పతకాన్ని అందుకునే శాస్త్రవేత్త పేరు పతకం అంచులో ముద్రించబడి ఉంటుంది.