• చంద్రబాబు పాలనలో రాష్ట్రం సస్యశ్యామలం: అజీజ్

నెల్లూరు, జనవరి 8 (న్యూస్‌టైమ్): ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడుతారని వైసీపీ నాయకులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే, అసెంబ్లీకి పోకుండా మొహం చాటేశారని, బాధ్యతలు విస్మరించిన వారికి ఆ పదవులెందుకు అని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలూ శ్రమిస్తూ, అభివృద్హి నిరోధకులుగా మారిన కేంద్రంలోని ప్రధాని మోదీ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిలతో ఏకకాలంలో పోరాడుతున్నారని ఆయన తెలిపారు.

‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక 36, 51 డివిజన్లయిన క్రాంతి నగర్, కాపాడిపాలెం ప్రాంతాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సభలకు మేయర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ప్రజలందరికీ మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, టిడిపి, వైసిపి, సిపిఎం అన్న బేధాలు లేకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టామని మేయర్ స్పష్టం చేసారు.

ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వంతో పోరాడి సాధించేందుకు అవకాశమిచ్చిన అసెంబ్లీ వేదికను వదిలేసి, వైసిపీ ఎమ్మెల్యేలు దండాలు పెట్టుకుంటూ రోడ్లపై తిరుగుతున్నారని, కార్పొరేటరు పాటి అభివృద్ధిని సైతం సాధించలేనివారిగా నవ్వులపాలవుతారని మేయర్ విమర్శించారు. ప్రజల అవసరాలను గుర్తించి గత ప్రభుత్వాలకన్నా మెరుగైన సంక్షేమ పధకాలను చంద్రబాబు ప్రవేశపెట్టడంతో పాటు అత్యంత పారదర్శకంగా అమలుచేస్తూ, రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తున్నారని తెలిపారు.

పార్టీలకు అతీతంగా కార్పొరేషను పరిధిలోని అన్ని డివిజనుల్లోని ప్రధాన మార్గాల్లో తారు రోడ్లు, వీధుల్లో సిమెంటు రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణాలను చేపట్టామని, నిర్మాణ పనులన్నీ అత్యంత త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామని మేయర్ స్పష్టం చేసారు. ఒకే కుటుంబంలోని అర్హులైన అందరికీ పెన్షను అందించేలా ముఖ్యమంత్రి చేస్తున్న ఆలోచన అత్యంత హర్షణీయం అని మేయర్ కొనియాడారు. పేదవాడి స్వంత ఇంటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన ‘ఎన్టీఆర్ హౌసింగ్ ఫర్ ఆల్’ పధకం ప్రజల జీవితాల్లో ఉన్నతమైన మార్పు తీసుకొస్తుందని స్పష్టం చేసారు.

రేషన్ కార్డు ఇంకా పొందని పేదవారు సైతం ఎన్టీఆర్ గృహాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా పధకంలో సవరణలు చేసి, ఓటర్ గుర్తింపును ప్రామాణికంగా తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. సంక్షేమ పధకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ శిబిరంలో దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా ఇతర సామాజిక సమస్యలను సైతం ఆయా డివిజనుల్లో జరిగే జన్మభూమి సభల్లో విజ్ఞప్తుల రూపంలో అందజేస్తే, సత్వరమే సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం స్పందిస్తుందని మేయర్ వెల్లడించారు.

అనంతరం శిబిరంలో నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మేయర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు నిర్వహించిన సామూహిక సీమంతాల్లో మేయర్ పాల్గొని, ఆరోగ్యవంతమైన సంతానానికై పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమాల్లో విజయ డైరీ చైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు షేక్ వహీదా, మీదూరు ప్రశాంత్ కుమార్, నాయకులు నన్నే సాహెబ్, అన్నం దయాకర్ గౌడ్, బండి రమేష్, షంషుద్దీన్, అదనపు కమిషనరు వెంకటేశ్వర్ రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here