విజయవాడ, జనవరి 9 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు తగ్గుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ఆదిశేషగిరిరావు వైకాపా అధినేత వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డికి పంపించారు. త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఆయన ఆ మేరకు తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ కూడా పొందినట్లు తెలుస్తోంది.

ఆదిశేషగిరిరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియశీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఎపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. వైఎస్ మరణానంతరం జగన్‌కు అండగా నిలిచిన ఆయన ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. విజయవాడ పార్లమెంటు సీటును జగన్ ఘట్టమనేనికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన తెనాలి అసెంబ్లీ స్థానం నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు లోక్‌సభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు కృష్ణ అభిమానుల సంఘం తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి తెదేపాలో చేరడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.