హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించినందుకు ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలి కృతజ్ఞతలు తెలిపారు. సీతారామప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం పట్ల అజయ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి సమస్యను తీర్చే సీతారామప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు రావడం పట్ల సీఎంను ఆయన అభినందించారు.

దాదాపు 1500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని సుమారు 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం రావడంతో రైతులు హర్షం చేస్తున్నట్టు ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంకు సాగునీరు అందనుందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు.