విశాఖపట్నం, జనవరి 9 (న్యూస్‌టైమ్): పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సేవలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు బుధవారం తరించారు. ఉదయం స్వామివారి సన్నిధికి చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి అప్పన్న దర్శన భాగ్యం కల్పించారు.

ముందుగా వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత గవర్నర్ దంపతులు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం ప్రదక్షిణ అనంతరం వేద మంత్రాల నడుమ ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. సింహాచలేశుని కరుణ, కటాక్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు నరసింహన్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఐటీ, పర్యాటక, పారిశ్రామిక రంగాలలో విశాఖపట్నం తన ఉనికిని చాటుకుంటోందన్నారు.