హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు పకడ్భంది ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషి ఆదేశించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి 26న ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని, గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ముఖ్యఅతిధిగా పాల్గొంటారని అన్నారు. వేడుకలకు అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

జీహెచ్ఎంసీ ద్వారా పరేడ్ గ్రౌండ్స్‌లో పారిశుధ్యం, మోబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని గన్ పార్క్, క్లాక్ టవర్, ఫతేమైదాన్‌లను విద్యుద్ధీకరించాలని తెలిపారు. రహదారులు, భవనాల శాఖ ద్వారా అవసరమైన బారీకేడింగ్, సీటింగ్, సైనేజ్‌లతో పాటు రాజ్‌భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌లతో పాటు చారిత్రక ప్రాధాన్యత భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని తెలిపారు. విద్యుత్ శాఖ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా, మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి సరఫరా, సమాచార శాఖ ద్వారా మీడియాకు ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎల్ఈడీ టీవీలు, కామెంటేటర్ల నియామకం, వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఉద్యానవన శాఖ ద్వారా పరేడ్ గ్రౌండ్‌లో పుష్పాలతో అలంకరణ వినూత్నంగా ఉండాలన్నారు. వేడుకకు హాజరయ్యే పాఠశాల విద్యార్ధుల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయాలన్నారు. అంబులెన్స్, అగ్నిమాపక ఏర్పాట్లు ఉండాలన్నారు. అమర వీరుల సైనిక స్మారక్ వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించేందుకు రానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here