హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): శంషాబాద్‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం వేకువజామున భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. 1.03 కోట్ల రూపాయల నగదును సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, పట్టుబడిన వ్యక్తి వివరాలను వెల్లడించేందుకు భద్రతాధికారులు నిరాకరించారు. వివిధ దేశాలకు చెందిన ఈ నగదును విమానంలో దుబాయికి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న నగదును సీఐఎస్ఎఫ్ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. గతంలో కూడా ఇదే ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ కరెన్సీ పట్టుబడిన సందర్భాలు అనేకం. దొంగ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా, ఏటీఎంలో నగదు జమ చేయాల్సినవాడే కరెన్సీని తెలివిగా తస్కరించిన సంఘటనలో సదరు నిందితునితోపాటు అతడికి సహకరించిన ప్రేమికురాలు, మరో స్నేహితుడిని కీసర పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.40లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నాగారంలోని కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ ఏటీఎంలో తరచూ నగదు తక్కువగా ఉంటున్నట్లు బ్యాంకుకు చెందిన అధికారులకు అనుమానం కలిగి పరిశీలించగా రూ.47,37,700/- తక్కువగా వచ్చింది.

కీసర పోలీసులు దర్యాప్తు చేసి సబ్‌ కాంట్రాక్టు తీసుకున్న వ్రైటర్‌ సేఫ్‌గార్డు సంస్థలో పనిచేసే సాయిరామ్‌ సాయికృష్ణ(26)ను నిందితుడుగా తేల్చారు. మేడ్చల్‌ జిల్లా యాప్రాల్‌ సమీపంలోని కుమ్మరి బస్తీకి చెందిన సాయికృష్ణ తన దగ్గర ఉన్న తాళం సాయంతో ఆ మొత్తాన్నీ వెనక్కి తీసేవాడు. దాన్ని అమ్ముగూడలో ఉండే తన ప్రియురాలు పూజ(23)కు చెందిన అకౌంట్లలో జమ చేశాడు. మిగతా నగదును నేరెడ్‌మెట్‌ వాజ్‌పేయినగర్‌కు చెందిన తాటికొండ నాగరాజు అనే స్నేహితుని అకౌంట్‌లో జమచేశాడు. ఆ డబ్బుతో ఓ కారు కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here