శ్రీకాకుళం, జనవరి 9 (న్యూస్‌టైమ్): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ బుధవారం అభిమానుల సందడి, కోలాహాలం మధ్య ముగిసింది. యాత్రకు ప్రతీకలా పార్టీ నాయకులు భావిస్తున్న ‘విజయ సంకల్ప స్థూపం’ను బాణసంచా పేలుళ్ల నడుమ జగన్ ఆవిష్కరించారు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రజల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య విజయ సంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు. 2017, నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా దీనిని ఆవిష్కరించారు.

వేలాది మందితో పాదయాత్రగా వచ్చిన జగన్‌ స్థూపం ప్రాంగణంలోకి వెళ్లి ఆసాంతం పరిశీలించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడున్న పార్టీ సీనియర్‌ నేతలు, ఇతర ప్రముఖులను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు విజయ సంకల్ప స్థూపం నమూనాను అందజేశారు. మూడు అంతస్తులతో నిర్మించిన ఈ స్థూపం చరిత్రాత్మకమైనదిగా నిలిచిపోతుందని పార్టీ నేతలు వివరించారు. ప్రతిష్టాత్మకమైన రీతిలో సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి చరిత్ర సష్టించిన జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇచ్ఛాపురం వేదికగా ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాన ఉవ్వెత్తున ఎగసి పడిన జనసంద్రం సాక్షిగా భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఊపును, ఉత్సాహాన్ని నింపింది.

సుమారు రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగిన ఆయన ప్రసంగం పార్టీ అభిమానులను ఆకట్టుకుంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో జిత్తుల మారి, మాయావి అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాతో జరిగేది ఇక యుద్ధమేనని ప్రకటించి దిశానిర్దేశనం చేశారు. తన పాదయాత్ర ముగిసిందని, అయితే నారాసురుడితో ఇకపై అలుపెరుగని రీతిలో పోరాటం చేయబోతున్నామని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. జగన్‌ తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసం తొణికిస లాడింది. ప్రజలు తనకు తోడుగా నిలిస్తే ప్రభుత్వం మోసాలు, అన్యాయాలపై విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేసి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు.

జగన్‌ పాదయాత్ర ముగింపు ఓ మరపురాని ఘట్టం కనుక 13 జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు. స్తూపం వద్దకు చేరుకున్నపుడే కార్యకర్తల్లో విజయ సంకల్ప స్థూపం వద్ద ఉత్తేజభరిత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జగన్‌ చేసిన ప్రసంగం వారిలో ఇంకా పోరాట పటిమను రేకెత్తించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఆత్మ విశ్వాసానికి, విజయ సంకల్పానికి సూచికగా 91 అడుగుల ఎత్తులో ఈ స్థూపాన్ని నిర్మించారు. లక్షలాది ప్రజల గుండె చప్పుళ్లకు ఇది చిహ్నంలా నిలిచింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు తమ పాదయాత్రల ముగింపు సందర్భంగా స్థూపాలు నిర్మితమైన ఏకైక ప్రాంతంగా ఇచ్ఛాపురం నిలిచింది.

వైఎస్సార్, ఆయన కుమార్తె షర్మిల పాదయాత్ర ముగింపులకు కూడా ఇచ్ఛాపురమే వేదికైంది. ఈ సందర్భంగా స్థూపాలు నిర్మించారు. ఈ స్థూపం ప్రాంతమంతా జన జాతరను తలపించింది. అక్కడికి చేరుకున్న జనమంతా ఆ స్థూపాన్ని ఆసక్తిగా తిలకించారు. ఫొటోలు దిగారు. జగన్‌ వచ్చి ఆవిష్కరించేంత వరకు అదరూ స్థూపం గురించే చర్చించుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించాక వేలాది మంది జనం మధ్య వైఎస్‌ జగన్‌ బహుదా నది మీదుగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఇచ్ఛాపురం పట్టణంలోకి ప్రవేశించారు.

‘‘కృష్ణా జిల్లా ప్రజలు నాతో ఓ మాటన్నారు. మా అల్లుడుగారు (చంద్రబాబు) ఇక్కడికి ఇల్లరికం వచ్చారన్నా. ఎన్టీఆర్‌ ఇల్లునే కాదు, పార్టీనే కాదు, చివరకు రాష్ట్రాన్నే దోచుకుతిన్నారని చెబుతున్నారు. ఇలాంటి మోసాలు చేసే, అబద్ధాలు చెప్పే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే తానేమీ చెయ్యకపోయినా అన్నీ చేసినట్టు బుకాయిస్తాడు. అన్నీ ఇచ్చానని, ప్రజలు కేరింతలు కొడుతున్నారని ఎల్లో మీడియాలో రాయిస్తాడు’’ అని జగన్ తన ప్రసంగంలో ఉటంకించారు.

‘‘చంద్రబాబు మాత్రం ఆయన, ఆయన బినామీలతో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి, రైతుల్ని మోసగిస్తూ అడ్డగోలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ రహస్యాలు కాపాడతానని, అవినీతికి తావు లేకుండా చేస్తాం అని ప్రమాణం చేసిన ఈ పెద్దమనిషి. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన బినామీలకు చెప్పి దగ్గరుండి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసినందుకు, రైతుల్ని మోసం చేసినందుకు బొక్కలో వేయాల్సిన పని లేదా?’’ అని అన్నారు.

‘‘జన్మభూమి కమిటీలుండవు, ఎవరికీ ఒక్క రూపాయి లంచమిచ్చే పరిస్థితి ఉండదు. అప్పులను చూసి ఎవరూ భయపడొద్దు. ఎన్నికల నాటికి మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల చేతికే అందేలా చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని జగన్ చెప్పారు.

‘‘చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మళ్లీ ఇపుడు నాలుగేళ్లుగా ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. దీంతో మద్య నిషేధం గోవిందా.. అందాక ఉన్న 2 రూపాయలకు కిలో బియ్యం సబ్సిడీ గోవిందా.. అందాక ధైర్యంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా గోవిందా.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గోవిందా.. వ్యవసాయం గోవిందా.. వర్షాలు గోవిందా.. ఇళ్ల నిర్మాణం గోవిందా.. పెన్షన్లన్నీ గోవిందా.. అన్నీ గోవిందానే’’ అని వ్యాఖ్యానించారు.

‘‘రిలయన్స్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలతో రేషన్‌ షాపుల స్థానంలో బడా మాల్స్‌ పెట్టిస్తారట. వీటిల్లో ప్రజలకు సరుకులు 20 శాతం తక్కువ ధరకు లభిస్తాయని చెబుతున్నారు. ఇంతకు ముందు రేషన్‌ షాపుల్లో 20 శాతం కాదయ్యా.. 60 శాతం తక్కువ ధరకు దొరికేవయ్యా.. చంద్రబాబు గారూ’’ అని ఎద్దేవాచేశారు.

‘‘చంద్రబాబూ.. నేను సూటిగా అడుగుతున్నా.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చింది నువ్వు కాదా? నీ బావమరిది బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా తీస్తున్నాడు. ఆ షూటింగ్‌ సెట్స్‌లో వెంకయ్యనాయుడు కన్పించడం లేదా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు అడ్డగోలుగా నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన నువ్వు.. బీజేపీతో కక్కుర్తి పడ్డావు కాబట్టే ఇవాల్టి వరకూ అరెస్టు కాకుండా తిరగగలుగుతున్నావనేది నిజం కాదా? రాష్ట్రంలో చంద్రబాబు, ఈయన కొడుకు చెయ్యని అవినీతి లేదు. ఇసుక నుంచి మొదలు పెడితే మట్టిదాకా.. బొగ్గు, కరెంట్‌ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ అసైన్డ్‌ భూములు.. చివరకు గుడి భూములు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి వాస్తవం కాదా? ఈ నాలుగేళ్ల కాలంలో అక్షరాల నాలుగు లక్షల కోట్ల రూపాయలు సంపాదించావ్‌. అయినా నీ మీద సీబీఐ విచారణ జరగకుండా కాలం వెళ్లబుచ్చుతున్నావంటే నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే కదా చంద్రబాబూ? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టులో మీకు నచ్చిన కాంట్రాక్టర్లను బినామీలుగా తీసుకొచ్చి, నామినేషన్‌ పద్ధతిలో మీ ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచి అక్షరాల రూ.1,853 కోట్లు లూటీ చేశారని కాగ్‌ నివేదిక చెప్పినా, నీ మీద సీబీఐ విచారణ జరగడం లేదంటే.. నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నట్లే కదా చంద్రబాబూ? నువ్వీమధ్య నీతి ఆయోగ్‌ సమావేశం జరిగినప్పుడు ఢిల్లీకెళ్లావు. అక్కడ మోదీ కన్పిస్తే నువ్వు చేసిందేంటి? ఆయనకు వంగి వంగి నమస్కారం పెట్టడం నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మా మిత్రుడని నిండు లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అనడం నిజం కాదా?’’ అని విమర్శించారు.

‘‘2014 ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు వేసినట్లే అని చంద్రబాబు అన్నాడు. బీజేపీతో జత కట్టాడు. ఇప్పుడు జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటాడు. కాంగ్రెస్‌తో జత కడతాడు. ఆయనకు మంచిదన్నది ఈనాడుకు మంచిదవుతుంది.. అదే రాస్తుంది. టీవీలలో చూపిస్తారు. ఈయన తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటుంది. చెరువులను బాగు పరచాలంటే మూడడుగులు తవ్వితే ఫర్వాలేదు.. సిల్ట్‌ తీస్తున్నారులే అనుకోవచ్చు. కానీ పూడిక తీత అని నామకరణం చేసి, దానికి నీరు–చెట్టు అని పేరుపెట్టి ఏకంగా 50 అడుగుల వరకూ తవ్వేస్తే నీళ్లందక రైతులు అగచాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రే దగ్గరుండి ఇలా దోచుకోవడం సబబేనా? లారీ ఇసుక రూ.30 వేలకు అమ్మకుంటున్నారని ప్రజలు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నాడు. మీకు ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? ఎవరికిస్తున్నారో తెలుసా? చంద్రబాబు బినామీలకు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు. అవి చినబాబు దగ్గరకు పోతున్నాయి. అక్కడి నుంచి పెదబాబు దగ్గరకెళ్తున్నాయి. వ్యవస్థ ఇంతగా దిగజారింది. ఇవాళ ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. జేఎన్‌టీయూ లెక్చరర్లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల సిబ్బంది. ఏఎన్‌ఎమ్‌లు, సెకెండ్‌ ఏఎన్‌ఎమ్‌లు, విద్యుత్‌ రంగంలోని కార్మికులు, మోడల్స్‌ స్కూళ్ల సిబ్బంది, ఆదర్శ రైతులు, గోపాలమిత్రలు, ఆయుష్‌ ఉద్యోగులు, వీఏవోలు, సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీలు.. ఇలా అందరిలోనూ అభద్రత నెలకొంది. ఆసుపత్రులసర్వీసులనూ ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే అంతో ఇంతో ఉద్యోగాలొస్తాయి. దాన్ని చంద్రబాబు దగ్గరుండి నీరుగార్చాడు. వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లెక్క తెల్చారు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా? డీఎస్సీ పరీక్షలు పెట్టడు. కానీ ఆ డీఎస్సీ పరీక్షల కోసం పిల్లలు ప్రిపేర్‌ కావడానికి టెట్‌–1, టెట్‌–2, టెట్‌–3 అంటాడు. ఈ పెద్దమనిషి వ్యవసాయం దండగన్నాడు. ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంట్‌ తీగల మీద బట్టలారేసుకోవాలన్నాడు. ప్రాజెక్టులు కడితే ఖర్చు తప్ప రాబడి ఉండదన్నదీ ఈయనే. సబ్సిడీలు పులిమీద సవారీలాంటివని ఆయన అనడమే కాకుండా..ఏకంగా తన పుస్తకంలో రాసుకున్నాడు.రైతుకు సంబంధించిన అవార్డు ఇలాంటి వ్యక్తికివ్వడం ఆ అవార్డును అవహేళన చేసినట్టు కాదా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో వచ్చేదేంటో తెలుసా? కరవు. అందుకే ఆయనకు ఉత్తమ కరవు రత్నఅనే అవార్డు ఇవ్వొచ్చు. కరవొచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలి. కానీ ఈయన మాత్రం ఆదుకోకుండా వెనకడుగు వేస్తాడు. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు. అందుకే ఈయనకు కలియుగ కుంభకర్ణ అనే అవార్డుకచ్చితంగా ఇవ్వొచ్చు. ఆయన సీఎం అవుతూనే సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలను దగ్గరుండి మూసేయిస్తాడు. అందుకే ఉత్తమ సహకార రంగ ద్రోహి అనేఅవార్డు కూడా ఇవ్వొచ్చని సిఫార్సు చేస్తున్నా’’ అని జగన్ పేర్కొన్నారు.

‘‘ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. నడిచింది నేనైనా నడిపించింది మాత్రమే మీరూ, ఆ దేవుని దీవెనలే. హైదరాబాద్ నుంచి దుబాయ్ 3 వేల కిలోమీటర్లు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దూరం 3440 కిలోమీటర్లు. పాదయాత్ర రికార్డులను దాటేసింది. ఎంత దూరం నడిచాం అన్నది ముఖ్యం కాదు. ఎంత మంది ప్రజలను కలిశాం. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం. 600 హామీలు ఇచ్చి ప్రతీ కులాన్నీ ఎలా మోసం చేయవచ్చు అన్న దానిలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్టంలో కరువు పరిస్థితులు ఉంటే రెయిన్ గన్‌ల పేరుతో చంద్రబాబునాయుడు సినిమా చూపించారు’’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివన్న యథార్థ గాథను జగన్ వినిపించి ఆకట్టుకున్నారు.

‘‘జాతీయ రాజకీయాల పేరుతో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తిరుగుతారు కానీ మన రాష్ట్రంలో రైతన్నల కష్టాలను తీర్చాలన్న ధ్యాసే లేదు చంద్రబాబుకు. రైతు ఆదాయంలో మన రాష్ట్రం రైతులు దేశంలోనే 28వ స్థానంలో, రైతు అప్పుల్లో మాత్రం 2వ స్థానంలో ఉంటే గ్రోత్ రేట్‌లో నెంబర్ 1 అంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే చంద్రబాబును నమ్మం బాబూ అని రైతులు, ప్రజలు అంతా అంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘పొదుపు సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మల రుణాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ. 14,2014 కోట్లు ఉంటే ఇప్పుడవి వడ్డీలు పెరిగిపోయి రూ. 22,174 కోట్లకు చేరాయి. సున్నా వడ్డీ రుణాలకు కూడా బాబు ఎగనామం పెట్టాడు. బాబు వచ్చాడు కానీ జాబు రాలేదు. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు అని నిరుద్యోగ యువత అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పుడవి 2.40 లక్షలకు పెరిగినా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రతి ఇంటికీ రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు, అదీ కొద్ది మందికే వెయ్యి ఇస్తానంటున్నాడు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. అన్నీ అబద్ధాలే. జాబు రావాలంటే బాబు పోవాలి. అందుకే యువత నిను నమ్మం బాబూ అంటున్నారు’’ అని ఎద్దేవాచేశారు.

‘‘చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అక్షరాలా 6 వేల ప్రభుత్వ స్కూళ్ళు మూసేశాడు. ఎస్సీ, ఎస్టీల హాస్టళ్ళు మూసేశాడు. కవిటి మండలంలో ఓ జూనియర్ కాలేజీలో కనీసం బాత్ రూమ్‌లు కూడా లేవని ఓ విద్యార్థిని చెప్పింది. చంద్రబాబు మాత్రం మరుగుదొడ్ల నిర్మాణంలో నెంబర్ 1 అంటాడు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న బడుల్లో టీచర్లు లేరు. పుస్తకాలు ఇవ్వటం లేదు. ఈ విధంగా ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ నారాయణ, చైతన్య సంస్థలను మాత్రం పెంచుతున్నారు చంద్రబాబు’’ అని విమర్శించారు.

‘‘ఆరోగ్యశ్రీలో నెట్ వర్క్స్ ఆసుపత్రులకు 8 నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోయాయి. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ రోగులు డయాల్సిస్ చేయించుకుంటా ఉంటే వీరిలో కేవలం 1400 మందికి మాత్రమే ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. కిడ్నీ బాధితులకు పెన్షన్లు కూడా కేవలం 370 మందికి మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. 108 అంబులెన్స్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంది. హైదరాబాద్‌కు వెళితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్న నమ్మకం లేని పరిస్థితి. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోంది. రేషన్ కార్డు నుంచి మరుగుదొడ్డి వరకూ ఏది కావాలన్నా లంచం, లంచం. గ్రామాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెన్షన్ కావాలంటే ఏ పార్టీ అని అడుగుతున్నారు. పెన్షన్ కావాలంటే బతికి ఉన్నా సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకోపక్క ఇసుక, మట్టి, బొగ్గు, మద్యం, కాంట్రాక్టులు ప్రతిదీ దోపిడే’’ అని అన్నారు.

‘‘చంద్రబాబు నాయుడు నోటికి-మెదడుకు కనెక్షన్ తెగింది. అందుకే నోటికేది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఎన్నికలొచ్చేటప్పటికీ భయం పట్టుకుంది. ఆదరణ-2 అని, కొత్త ఇళ్ళు, పెన్షన్లు, మరొకటి అని డ్రామాలు ఆడుతూ కొత్త సినిమా చూపిస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి, అందులో నలుగుర్ని మంత్రుల్ని చేశాడు. చంద్రబాబు పాలన కావాలా ఇంకా? ఇలాంటి మనిషి కావాలా? అని అడుగుతున్నాను. నాలుగేళ్ళు ప్రత్యేక హోదాను ఖూనీ చేశాడు. ఆ నాలుగేళ్ళు బీజేపీతో కాపురం చేసి తన పార్టీకి చెందిన మంత్రులను బీజేపీ ప్రభుత్వంలో ఉంచుతాడు. నాలుగేళ్ళు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతాడు. ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వకపోయినా వారికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేస్తాడు. అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడితే వెటకారం ఆడతాడు. నాలుగేళ్ళు మోడీ- బాబు జోడి పేరుతో వారి మధ్య సాగిన ప్రేమ, పొగడ్తలు చూస్తే వారి ప్రేమను చూసి చిలక-గోరింకలు కూడా సిగ్గుపడేలా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘గత రెండు మూడు నెలలుగా చంద్రబాబు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడు. చంద్రబాబు-మోడీకి మధ్య యుద్ధం అని ఈనాడు రాస్తోంది. ఆ పేపరు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. నాలుగేళ్ళు చిలకా-గోరింకల్లా ప్రేమ. ఎన్నికలకు మూడు నెలల ముందు యుద్ధమా? పేపర్లు, టీవీలు అడ్డం పెట్టుకొని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తాను చెప్పింది చేయకపోతే ఆ రాజకీయ నాయకుడ్ని రాజీనామా చేయించి ఇంటికి పంపించేలా చేయాలి. అటువంటి విశ్వసనీయ రాజకీయాలు రావాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలంటే అది జగన్ ఒక్కరి వల్ల సాధ్యపడదు. జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలి’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రతి పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేరాలి. ఆ దిశగా పాలన ఉండాలి. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, మతం, అనేది అడ్డు కాకూడదు. వ్యవస్థలో మార్పు దిశగా మనమంతా అడుగులు వేయాలి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేస్తాను. ఈ విధంగా జవాబుదారీతనం పెంచుతాం. కలెక్టర్లు ప్రజలకు మరింత చేరువ చేస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్‌ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చే విధంగా చేస్తాను. ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీ‌ర్‌గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. వాలంటీయర్ ఆ 50 ఇళ్ళకు జవాబుదారీగా ఉంటూ గ్రామ సెక్రటేరియేట్‌తో అనుసంధానమై పనిచేస్తూ నవరత్నాలు నుంచి రేషన్ బియ్యం వరకూ నేరుగా ఇంటికే వచ్చే విధంగా డోర్ డెలివరీ చేస్తాం. రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్‌ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం. గిట్టుబాటు ధరల కోసం రూ. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు లీటర్ పాలు రూ. 26కు అమ్ముకుంటున్నారు. హెరిటేజ్ కోసం పాడి రైతులను నాశం చేశాడు చంద్రబాబు. హెరిటేజ్‌లో మాత్రం అర లీటరు పాలు రూ. 45కు అమ్ముతున్నారు. పాడి ప్రోత్సాహం కోసం లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తాం. సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు నష్టపోకుండా రూ. 4 వేల కోట్లు(రూ. 2వేల కోట్లు రాష్ట్రం ప్లస్ రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లకు పరిహారం రూ. 3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం. రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే వైయస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు. ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం’’ అని జగన్ హామీ ఇచ్చారు. ‘‘ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది నాకున్న ఆశ. నా పాలన చూసి నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ. నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాల మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా ఓటు వేయరు. ఆరు నెలలు కలిసి ఉంటే. వారు వీరు వీరు వారవుతారు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. జరిగే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదు. ఈ నారాసురుడికి ఎల్లో మీడియా ఉంది. జిత్తులు మారి ఈ మాయావి చంద్రబాబు పొత్తులు, ఎత్తులను, అన్యాయాలను జయించేందుకు మీరంతా తోడుగా ఉండాలి’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here