న్యూఢిల్లీ, జనవరి 11 (న్యూస్‌టైమ్): విజ‌య‌, దేనా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడాల‌ను విలీనం చేస్తూ భార‌తీయ బ్యాంకింగ్ రంగంలో ప్రథమ త్రిమార్గ విలీనీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేర‌కు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో విజ‌య బ్యాంక్‌, దేనా బ్యాంకులు విలీన‌ం కానున్నాయి. దేశంలో ప్ర‌భుత్వ‌ రంగ‌ బ్యాంకుల‌ను సంఘ‌టితం చేయ‌డంలో భాగంగా ఈ త్రిమార్గ విలీన ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఈ మూడు బ్యాంకులు క‌ల‌గ‌ల‌సి దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకు అవ‌త‌రించ‌నుంది. ఈ విలీనం అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీని ఇవ్వ‌గ‌ల బ్యాంకు ఆవిర్భావానికి దారి తీస్తుంది. త‌ద్వారా భారీ ఆర్థిక నిల్వ‌ లు ఏర్ప‌డ‌టంతో పాటు విస్తృత శ్రేణి స‌మ‌న్వ‌యం సాధ్య‌పడుతుంది.

ఆయా బ్యాంకుల నెట్‌‌వ‌ర్క్‌లు, వాటి అనుబంధ సంస్థ‌లు సామూహికంగా త‌క్కువ భారం గ‌ల డిపాజిట్ల సేక‌ర‌ణ‌కు వీలు క‌ల్పిస్తాయి. అలాగే ఖాతాదారుల పునాదిని విస్త‌రించ‌డంతో పాటు స‌మీకృత సంస్థ‌గా రూపుదాలుస్తుంది. దీంతో పాటు విపణి విస్తృతం కావ‌డ‌మే కాక నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం కూడా పెరిగి ఉత్ప‌త్తుల, సేవ‌ల సంఖ్య పెంపొందుతుంది. త‌ద్వారా ఖాతాదారుల‌కు బ్యాంకింగ్ రంగం మ‌రింత‌గా అందుబాటులోకి వ‌స్తుంది. విజ‌య బ్యాంక్‌, దేనా బ్యాంక్ బ‌దిలీ అయ్యే బ్యాంకులు కాగా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బ‌దిలీ స్వీక‌ర‌ణ బ్యాంకుగా ఉంటుంది. ఈ ప‌థ‌కం వచ్చే ఏప్రిల్ 1 నుండి అమ‌లులోకి వ‌స్తుంది.

ఈ ప‌థ‌కం ఆరంభ‌మ‌య్యాక బ‌దిలీ బ్యాంకుల బాధ్య‌త‌లు బ‌దిలీ స్వీక‌ర‌ణ బ్యాంకుకు బ‌దిలీ అవుతాయి. ఈ రెండు బ్యాంకుల వ్యాపారం, ఆస్తులు, హ‌క్కులు, అధికారాలు, క్లెయిములు, లైసెన్సులు, అనుమ‌తులు ఇత‌ర హ‌క్కులు, ఆస్తులు, అన్ని రుణాలు, బాధ్య‌త‌లు, క‌ర్త‌వ్యాలు ఇందులో భాగంగా ఉంటాయి. బ‌దిలీ బ్యాంకుల‌లోని ప్ర‌తి శాశ్వ‌త ఉద్యోగి, అధికారి బ‌దిలీ స్వీక‌ర‌ణ బ్యాంకులో అధికారి లేదా ఉద్యోగిగా కొన‌సాగుతూ వారి వారి బాధ్య‌త‌లను నిర్వ‌ర్తిస్తారు లేదా సేవ‌లను అందిస్తారు. వారి జీత‌నాతాలు, ఇత‌ర భ‌త్యాలు వారు ఇదివ‌ర‌కు పొందిన‌ వాటి కన్నా త‌క్కువ కాబోవు. బ‌దిలీ అయ్యే బ్యాంకుల ఉద్యోగులు, అధికారుల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు బ‌దిలీ స్వీక‌ర‌ణ బ్యాంకు బోర్డు పూర్తి స్థాయిలో భ‌రోసాను ఇస్తుంది.

బ‌దిలీ అయ్యే బ్యాంకుల వాటాదారుల‌కు బ‌దిలీ స్వీక‌ర‌ణ బ్యాంకు మార్పిడి నిష్ప‌త్తికి అనుగుణంగా వాటాల‌ను జారీ చేస్తుంది. దీనికి సంబంధించి మూడు బ్యాంకుల వాటాదారుల‌కు ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే ఆ సమస్యలను నిపుణుల సంఘానికి నివేదించే వెసులుబాటు ఉంటుంది. పెరుగుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విలీన బ్యాంకు స‌క‌ల ప‌ర్యావ‌ర‌ణాన్ని మార్చుకోగ‌ల సామ‌ర్థ్యాన్ని సంత‌రించుకుంటుంది. దీంతో పాటు ఆక‌స్మిక ఒడుదొడుకుల‌ను త‌ట్టుకుంటూ వ‌న‌రుల‌ను పెంచుకోగ‌ల సామ‌ర్థ్యం కూడా దీనికి స‌మ‌కూరుతుంది. భారీ ఆర్థిక వ‌న‌రులు, విస్తృత ప‌రిధిల కార‌ణంగా లాభ‌దాయ‌క‌త మెరుగుప‌డుతుంది. విస్తృత శ్రేణి ఉత్ప‌త్తుల‌ను అందిస్తూ విలీన బ్యాంకులలోని అత్యుత్య‌మ సాంకేతిక‌త‌ స‌హా ఉత్త‌మాచ‌ర‌ణ‌ల‌ను అనుస‌రించగ‌లదు.

ఈ విస్తృత పునాది ద్వారా వ్య‌యంలో పొదుపు, ముప్పు నిర్వ‌హ‌ణ మెరుగుద‌ల‌, ఆర్థిక సార్వ‌జ‌నీన‌తల‌కు భ‌రోసా లభిస్తుంది. అంత‌ర్జాతీయ బ్యాంకుల‌తో పోలిస్తే ఒక భారీ బ్యాంకుగా అవ‌త‌రించ‌గ‌ల‌గ‌డ‌ంతో పాటు భార‌త‌ బ్యాంకింగ్ రంగంలో, ప్ర‌పంచ బ్యాంకింగ్ రంగంలో గ‌ట్టి పోటీదారుగా నిలువ‌గ‌లుగుతుంది. దేనా బ్యాంకుకు సాపేక్షంగా గ‌ల త‌క్కువ భారంతో కూడిన సీఎఎస్ఎ డిపాజిట్ల సేక‌ర‌ణ సామ‌ర్థ్యం, విజ‌యా బ్యాంకు లాభ‌దాయ‌క‌త‌తో పాటు వృద్ధికి వీలు క‌ల్పించే మూల‌ధ‌నం లభ్యత, అంత‌ర్జాతీయంగా విస్తృత నెట్‌వ‌ర్క్‌ను కలిగివున్న బ్యాంక్ ఆఫ్ బ‌రోడా సామ‌ర్థ్యం త‌దిత‌రాల‌న్నీ క‌ల‌గ‌ల‌సి మార్కెట్‌కు చేరువ కాగ‌ల ప్ర‌యోజ‌నాలుగా రూపొందుతాయి. అంతేకాకుండా నిర్వ‌హ‌ణ సంబంధ సామ‌ర్థ్యాలు, విస్తృత శ్రేణి ఉత్ప‌త్తులను, సేవ‌లను అందించేందుకు త‌గిన మ‌ద్ద‌తు ల‌భించగలదు.

విలీన బ్యాంకులలోని విస్తృత సామ‌ర్థ్యం గ‌ల ప్ర‌తిభావంతులైన సిబ్బంది బ‌లం, భారీ సమాచార రాశి అందుబాటులోకి రాగలవు. డిజిట‌ల్ బ్యాంకింగ్ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో విశ్లేష‌ణాత్మ‌క చ‌ర్య‌ల‌ ద్వారా పోటీని ఇవ్వ‌గ‌లదిగా రూపొందుతుంది. ఇంత‌టి విస్తృత వ్య‌వ‌స్థ, పంపిణీ నెట్‌వ‌ర్క్‌ ఏర్పడుతున్న ఫ‌లితంగా ఒన‌గూడే ప్ర‌యోజ‌నాలు కూడా దిగువ‌కు ప్ర‌వ‌హిస్తాయి. దీంతో పాటు అనుబంధ సంస్థ‌ల‌ ద్వారా ఉత్ప‌త్తులు, సేవ‌ల ప్ర‌దాన వ్య‌యం కూడా త‌గ్గుతుంది. బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్‌తో పాటు విస్తృత‌మైన ఉత్ప‌త్తులు, సేవ‌ల శ్రేణి స‌హా రుణ‌ ల‌భ్య‌త మెరుగుప‌డ‌టం ద్వారా పెద్ద‌ సంఖ్య‌లో ప్ర‌జానీకానికి ల‌బ్ధి సైతం చేకూరుతుంది.