• మెగాస్టార్ సినిమాకు గ్రెగ్ పావెల్ వర్క్

ముంబయి, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విజయంపై యూనిట్‌తో పాటు అభిమానులు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీంతో చిత్రం బృందం ఆయా పోరాట సన్నివేశాలను తీయడానికి ప్రఖ్యాత హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్స్‌ సహాయం తీసుకుంటోంది. ఇందుకోసం ‘స్కైఫాల్‌’, ‘హ్యారీపోటర్‌ అండ్‌ ది డెత్లీ హాలోస్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌6’ తదితర చిత్రాలకు పనిచేసిన గ్రెగ్‌ పావెల్‌ పనిచేస్తున్నారు.

గ్రెగ్‌ పనిచేస్తున్న రెండో భారతీయ సినిమా ఇదే కావడం గమనార్హం. గతంలో ఆయన సల్మాన్‌ నటించిన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ చిత్రానికి స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా గ్రెగ్‌ పావెల్‌తో కలిసి సుదీప్‌ దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ‘‘ఈయన గ్రెగ్‌ పావెల్‌. లండన్‌కు చెందిన స్టంట్‌ కొరియోగ్రాఫర్‌. అద్భుతమైన హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేశారు. ‘సైరా’ కోసం ఆయనతో పని చేసే అవకాశం వచ్చింది’’ అని సుదీప్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here