ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి పొరపాటు చేసిందన్న అపవాదు మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో ఎంతటి పరాభవం జరిగిందో అందరికీ తెలిసిందే. కొత్త రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలోను, విభజించిన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ పార్టీకి దారుణమైన ఫలితం దక్కింది. అయితే, అప్పట్లో కేంద్రంలోని అధికార కాంగ్రెస్ నిర్ణయానికి వంతపాడిన బీజేపీకీ అంత మెరుగైన ఫలితం కానరాలేదు రెండు రాష్ట్రాల్లోనూ. అప్పట్లో కుదుర్చుకున్న పొత్తు ప్రకారం రెండు రాష్ట్రాల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల కదన రంగంలోకి దిగినా కనీసం గౌరవ ప్రధమైన ప్రతిపక్ష స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది.

ఇక, కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచినా ఆ పార్టీదీ అదే పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెరాస ‘కారు’ వేగానికి ‘హస్తం’ నిలివలేకపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంది. తాజాగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో పరిస్థితిని విశ్లేషిస్తున్న రాజకీయ పరిశీలకులు సైతం గత ఎన్నికల కంటే భిన్నమైన ఫలితాలేమీ ఉండవచ్చ సంకేతాలే ఇస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం తన సత్తా చాటుకుంటుందన్న ఆశతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతో పాటు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చినా సరే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం తప్పేలా కనిపించడం లేదన్న వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు, ఈ రెండూ ఇవ్వడం లేదని జాతీయ బీజేపీ కమిటీ, కేంద్ర ప్రభుత్వం తేల్చి పారేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్టీ మీద వ్యతిరేకత నషాళానికి ఎక్కింది. రానున్న ఎన్నికల్లో పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎవరో చెప్పే మాట కాదు, ఆవిర్భావం నుంచి బీజేపీనే నమ్ముకుని ఉన్న కరడు కట్టిన పార్టీవాదులే చెబుతున్నమాట. అధిష్టానం తీసుకునే అసంబద్ధ నిర్ణయాలకు, ఆంధ్రలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందనేది వాస్తవం.

విభజన సమయంలో నానా హంగామా చేసిన పార్టీ కేంద్ర కమిటీ పెద్దలు, నేడు యూ టర్న్ తీసుకోవడంతో స్థానిక క్యాడర్ తలెత్తుకుని ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా పోయింది. ‘ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు’ ఇస్తామని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ సైతం ఆంధ్రలో హామీలు గుప్పించి, ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక అంతా తూచ్ అన్నారు. ఇదే తడవుగా పార్టీ నేతలు ఎవరికీ వారు తమ పలుకుబడి వినియోగించి ఒక్కొక్కచోట కుదురుకున్నారు.

ఇదంతా కేవలం స్వార్ధపూరిత వ్యవహారం తప్ప, ప్రజా సంక్షేమం కోసం కనీసం కలలో కూడా ఆలోచన చేసిన దాఖలాలే లేవు. స్థానిక నేతలకు నోరు లేదు, ఉన్న వీళ్ళు అడగరు, అడగడం లేదు కదా మేము ఇవ్వడం లేదు అని కేంద్ర బీజేపీ ప్రకటన. 2014 ఎన్నికల్లో భారతదేశాన్ని కుదుపేసే ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ రాన్న ఎన్నికల్లో అదే స్థాయిలో తుడిచిపెట్టుకుపోయాయి, పార్టీ దాదాపుగా భూస్థాపితం అయ్యే ఫలితాలు రానున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఇదంతా కమలనాధుల స్వయంకృతాపరాధమే అని చెప్పకతప్పదు. కేవలం నరేంద్ర మోదీ, అమిత్ షా తీసుకునే నిర్ణయాలపైనే దేశంలో పార్టీ నడుస్తోందన్నది వాస్తవం. వీళ్ళకి అనుకూలంగా ఉండే నిర్ణయాలే తీసుకోవడం వలన, రాష్ట్రాల్లోని పార్టీ కేడర్ చిన్నాభిన్నమై పోయింది. బీజేపీలో అత్యంత కీలక నేతగా వెలుగొందిన ముప్పవరపు వెంకయ్యనాయున్ని భారత ఉపరాష్ట్రపతిగా పదోన్నతి కల్పించామని మోదీ, షా పైకి చెప్తున్నా ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపడానికి వేసిన ప్రణాళికగానే అనిపిస్తోందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ఆంధ్రకి అండగా ఉన్న పెద్దనేత ఏకంగా రాజకీయాల నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. ఆంధ్ర తరపున కేంద్రంలో నోరెత్తే వారే లేకపోవడం, పైగా విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు తెలుగుదేశానికి తొత్తులా వ్యవహరిస్తుండడంతో ఆంధ్రని బీజేపీ పూర్తిగా విస్మరించింది.

ఎన్నికల హామీలు అడగవలసిన ఎంపీ హరిబాబు కలలో కూడా కనీసం విశాఖ రైల్వే జోన్ పేరు తలవరు అని అయన సన్నిహితులే చెప్పడం గమనార్హం. మరోవైపు, తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకున్నది ఆంధ్రలో బీజేపీని భూస్థాపితం చెయ్యడానికే అన్నది అక్షర సత్యంగా మారింది. దీన్ని కేంద్ర నేతలూ నిరూపిస్తున్నారు. మరోవైపు, హరిబాబు, ప్స్తుతం విశాఖ లోక్ సభ సభ్యులు, గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన అభ్యర్థి. అయితే ఎవ్వరూ ఊహించనటువంటి ఈ మహత్తర అవకాశాన్ని ఆయన పూర్తిగా కాలరాసుకున్నారు అనే చెప్పాలి. తనకి వచ్చిన ఎన్నో గోల్డెన్ ఛాన్స్‌లను ఆయన చేజేతులా వదులుకున్నారు. బీజేపీని ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రాచుర్యం కల్పించేందుకు వచ్చిన అవకాశానను ఆయన ఏనాడూ సద్వినియోగం చేసుకోలేదు.

ఒక గిరిజన యూనివర్సిటీ వచ్చిన, ఐఐఎం వచ్చినా, ఐఐటి వచ్చినా ఈయన ఎటువంటి ప్రెస్ మీట్ నిర్వహించకుండా పూర్తిగా భాద్యతారాహిత్యం వహించారు అనే కారణంగా 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర కమిటీ కనీసం ఖాతరు కూడా చెయ్యలేదు. ఈ స్థానంలో సాగి కాశీ విశ్వనాధరాజు పేరు ప్రకటించడం గమనార్హం. అయితే, తేలుస్తారా? లేదా? అనేది ప్రధానం కాదు. కనీసం ఎంపీ హరిబాబు వైఖరి బీజేపీ కేంద్ర కమిటీకి నచ్చకపోవడమే కారణంగా ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్థానంలో సాధారణ కార్యకర్తను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చెయ్యగా, వ్యతిరేక వర్గం పండగ చేసుకుంటోంది.

పార్టీకి ప్రజాదరణ లభించే అంశాలను కూడా ఈయన లెక్క పెట్టకుండా బేఖాతరు చెయ్యడం గమనార్హం. విభజన హామీల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన హామీలను నెరవేర్చినట్టు కేంద్ర కమిటీ, కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి మరీ ప్రసంగాల్లో ఊదరగొడుతుంటే, ఇక్కడే స్థానిక ఎంపీగా ఉన్న హరిబాబు నోరు ఎత్తకపోవడంపై పార్టీలో పూర్తి వ్యతిరకత వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వారే వ్యతిరేకులు కారు, పార్టీకి మద్దతుగా నోరెత్తని వారు కూడా పార్టీ వ్యతిరేకులు అనేది బీజేపీ కేంద్ర కమిటీ తేల్చేసింది. ఇదే విధంగా ఈయన తీరు ఉంటే, రానున్న కాలంలో జనం ఈయన పేరుకూడా మరిచిపోయే అవకాశాలున్నాయని ఆయనకు అత్యంత సన్నిహిత కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈయన్నే నమ్ముకున్న తమ భవిష్యతు ఏంటో తెలియక వీరంతా సతమతమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో భారతీయ జనతా పార్టీకి రెండు లోక్‌సభ స్థానాలు లభించాయంటే అది ఆ పార్టీకి ప్రపంచాన్ని జయించినంత విజయంగా చెప్పవచ్చు. అలాంటిది విశాఖపట్నం, నర్సాపురం లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది అంటే అది కేవలం తెలుగుదేశం మద్దతుతోనే అని చెప్పాల్సియుంటుంది. అయితే, విశాఖపట్నం నుంచి ఎన్నికైన డాక్టర్ కంభంపాటి హరిబాబు, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి కృతఙ్ఞతగానే ఉన్నట్టున్నారు అన్నది వాస్తవం. ఈ విషయం ఆయన వెనక తిరిగే అత్యంత సన్నిహితుల వాక్యమే. రాష్ట్ర విభజన తదుపరి ఈయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖకి అధ్యక్షునిగానూ పనిచేశారు. అయితే, ఈయన వల్ల పార్టీకి జరిగిన పెద్ద ఘనకార్యాలు చెప్పుకోదగ్గవి లేనేలేవు అంటే అతిశయోక్తి కాదు. కేవలం తమ సామాజిక వర్గానికి చెందినవారు కావడమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈయనకు మద్దతు తెలపడానికి ప్రధాన కారణం.

పైగా బీజేపీ, తెలుగుదేశం మైత్రి తెగిపోయిన తర్వాత హరిబాబు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం గానీ, కనీసం తమ పార్టీపై నిస్సిగ్గుగా విరుచుకుపడుతున్న తెలుగుదేశంపై విమర్శలు చెయ్యకపోవడం పార్టీ అధిష్టానాన్ని విస్మయానికి గురిచేసింది. గతంలో నాటి కీలక నేత వెంకయ్యనాయుడు పార్టీలో ఉన్నంతవరకూ హరిబాబు హవా కొనసాగింది, ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్లిన నాటి నుంచి హరిబాబు అండ్ కోకు గడ్డుకాలమే ఎదురవుతోంది అనడానికి ఇదే నిదర్శనం.

ఇక, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా వ్యవహరిస్తున్న విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మళ్లీ గెలుస్తారన్న నమ్మకం ఆయనకే లేదు. ఆయనే కాదు, ప్రస్తుతం బీజేపీ నుంచి పదవులు వెలగబెడుతున్న ఎవరికీ ఈ నమ్మకం కలగడం లేదంటే అతిశయోక్తికాదు. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం భవిష్యత్తు కార్యాచరణను ఎలా మలుపుతిప్పుతుందో చూడాల్సిందే.਍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here