లక్ష్యం ఏదైనా జనసేన కూడా పూర్తిస్థాయి రాజకీయ పార్టీ అని మరోమారు నిరూపించుకుంది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సక్యతగానే ఉన్న పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో విభేదించినప్పటికీ కేంద్రాన్ని మాత్రం పల్లెత్తిమాట్లాడడం లేదు. నరేంద్రమోదీ పట్ల తనకు వల్లమాలిన ప్రేమాభిమానాలు ఉన్నట్లు పవన్ ఇప్పటికీ వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇక, చంద్రబాబు ప్రభుత్వాన్ని మాత్రం ఆయన ఎండగడుతూ విపక్షాన్ని తూలనాడుతూ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతున్నట్లు ప్రచారం కల్పిస్తూ మాంచి జోరుగా ఆయన ఉత్తరాంధ్ర పోరాట యాత్రను ముగించారు.

జనసేనలోకి ఇప్పుడిప్పుడే చేరికలూ మొదలయ్యాయి. పవన్ ఉత్తరాంధ్ర టూర్ ఏం చెబుతోంది? పవర్ స్టార్ బలమెంత పెరిగింది? అన్న అంశాలను విశ్లేషిస్తే మాత్రం ఈ పర్యటన వల్ల ఆయనకు పెద్ద మైలేజీ రాలేదన్నది మాత్రం స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్రను తన ఆవేశపూరిత ప్రసంగంతో ఒక కుదుపు కుదిపాడు పవన్. అభివృద్ధికి ఆమడ దూరంలో వెనుకబాటుతనంతో ఉన్నా సమైక్యతనే కోరుకున్న ఉత్తరాంధ్ర ప్రజల్లో తన ప్రసంగాలతో చైతన్యం నింపాడు పవన్.

వెనుకబాటు తనాన్ని తొలగించడానికి పాలకులు శ్రద్ధ చూపకపోతే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోరినా ఆశ్చర్యం లేదంటూ పదేపదే చెప్పుకొచ్చాడు ఆయన. ఇప్పటి వరకూ టీడీపీ, వైసీపీ మధ్య ఊగిసలాడిన జన సందోహం తొలిసారిగా మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేలా చేయగలిగాడు. పవన్ యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చిందని అభిమానులు, కొత్తగా ఆయన పార్టీలోకి వచ్చి చేరుతున్న వారూ అభిప్రాయపడుతున్నారు. తమ అధినేత జనాన్ని ఉర్రూతలూగించి ఆలోచింప చేశాడని అంటున్నారు.

ఓట్ల కోసమే యాత్రలు చేసే వారికి భిన్నంగా పవన్ యాత్ర సాగిందని చెప్పుకొస్తున్నారు. అడుగడుగునా అభిమాన జనం బ్రహ్మరథం పట్టారు. పవన్ యాత్ర సందర్భంగా విశాఖలో వలసలజోరూ కనిపించింది. ఇదంతా బలమే అనుకోవాలా అంటే మాత్రం విశ్లేషకులు కాదంటున్నారు. బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో పవన్ కొంత మేర ప్రభావం చూపగలిగినా టీడీపీకి కంచుకోటలా ఉన్న ఈ మూడు జిల్లాలో పవన్ మూడో ప్రత్యామ్నాయం కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందంటున్నారు విశ్లేషకులు. వైసీపీ, టీడీపీ హోరా హోరీగా తలపడే ఇక్కడ వైసీపీ గతఎన్నికల్లో గెలుపుకి కొంత దూరంలో ఆగిపోయింది. అయితే, ఈసారీ సీన్ అలాగే ఉండేలా కనిపిస్తోంది.

కాకపోతే టీడీపీ, వైసీపీలను కాదనుకున్న వారు మాత్రం పవన్ పార్టీ వైపు చూస్తున్నారు. కాగా, బలమైన జనాకర్షణ ఉన్న నేతలెవరూ జనసేన వైపు వెళ్లడంలేదు. కుల సమీకరణల్లో కొంత ఓటు బ్యాంకు పవన్ వైపు వెళ్లినా అది ప్రభావితం చేసేంత కాదన్నది ఒక వాదన. కానీ పవన్ ఉత్తరాంధ్రలో స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం చూస్తుంటే కొన్ని సీట్లయినా ఆయా జిల్లాల్లో చేజిక్కించుకోవాలన్న పట్టుదల ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. అక్కడ దృష్టి పెడితే ఒకటి రెండు సీట్లయినా సాధించవచ్చన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లు కనిపిస్తోంది.

ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత పవన్ సొంతగడ్డపై కాలు పెడుతున్నారు. పవన్ గోదావరి జిల్లాల్లో అడుగు పెడితే రాజకీయ వేడి పెరగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాంధ్రలో అధికార పార్టీని ఉతికి ఆరేసిన పవన్ గోదావరి జిల్లాల్లోనైనా వ్యూహం మార్చి సొంత పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాడా? అన్నది చూడాలి. అయితే, ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడంతో పవన్ తన పార్టీని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. వేర్వేరు పార్టీల నుంచి జనసేనలోకి వలస వస్తున్న నేతల్ని సాదరంగా స్వాగతిస్తున్న పవన్ వారికి టికెట్ల విషయంలో మాత్రం నిక్కచ్చి హామీ ఏమీ ఇవ్వడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కేవలం టికెట్లు ఆశించి వస్తున్న ఆశావహుల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. దీన్ని బట్టే జనసేన బలం, బలహీనతలు తేలనున్నాయి.

ఇదిలావుండగా, వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు, కార్యకర్తలే కాకుండా సినీ ప్రముఖల నుంచీ ఊహించని మద్దతు లభిస్తోంది. గతంలో సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి, విలక్షణ నటుడు పృథ్వీ పాదయాత్రలో జగన్ కలిసి మద్దతు పలికగా, తాజగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసి తన మద్దతును తెలియచేశారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. మరోవైపు, ప్రజాసంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. జగన్ తమ ఊరు పసలపూడి రావడం తమకు ఆనందాన్ని ఇచిందని అన్నారు చోటా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here