తిరుపతి, మార్చి 5 (న్యూస్‌టైమ్): తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిద‌వ రోజైన మంగ‌ళ‌వారం ఉదయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారు పురుషామృగ వాహనంపై భక్తులను క‌టాక్షించారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జీవో కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం 5.00 గంటలకు సుప్రభాతం, అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ తరువాత ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆనంతరం రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు తిరుచ్చిపై  స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో నాగ‌రాజు, సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌, అర్చకులు స్వామినాథ స్వామి, విజయస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు రెడ్డిశేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 6వ తేదీ బుధ‌వారం త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు.

ఉదయం 10 నుండి 11 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరగనుంది.  సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరగనుంది.