• వెలుగులోకి వస్తున్న సరికొత్త కోణాలు

  • ఆ డేటా పబ్లిక్‌డొమైన్‌లోనిదే: ఏపీ అధికారులు

  • ప్రజల డేటాను ప్రైవేట్‌వారికి ఎందుకిచ్చారు: జగన్‌

  • ఫారం-7 దుర్వినియోగంపై ద్వివేదికి మంత్రుల ఫిర్యాదు

హైదరాబాద్, అమరావతి, నెల్లూరు, మార్చి 5 (న్యూస్‌టైమ్): ఆ మధ్య తెరమీదకు వచ్చిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న అగ్గి మెల్లమెల్లగా చల్లాబడిందనుకున్న తరుణంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఐటీ గ్రిడ్స్ కేసు మరోమారు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దూరాన్ని పెంచేలా చేసింది. అసలు తనకు సంబంధం లేని వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం జోస్యం చేసుకుని పోలీసులను దర్యాప్తు పేరిట ఉసిగొలుపుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే అంశం కీలక అజెండాగా మంగళవారం నాటి మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది.

మరోవైపు ఈ కేసులో సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏపీ ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారం ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు, ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐటీ గ్రిడ్‌ డైరెక్టర్‌ అశోక్‌ను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు గత నెల 23వ తేదీనే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు సమాచారం.

ఆయన నుంచి కొంత ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు మరోసారి విచారణకు రావాల్సిందిగా పంపించారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు అశోక్‌ వెళ్లలేదు. ఫిబ్రవరి 27వ తేదీన ఐటీ గ్రిడ్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న సమాచారంతో పాటు సేవా మిత్ర యాప్‌లో కొంత సమాచారాన్ని తొలగించినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీస్ శాఖలోని ఐటీ విభాగం నిపుణుల సాయం తీసుకొని డేటా మొత్తం రికవరీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అశోక్‌ను అదుపులోకి తీసుకుంటే మరింత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

అశోక్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ఇతనికి ఎలా చేరిందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. లబ్ధిదారులు, ఓటర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇది వరకు కొన్ని సర్వేలు చేయించిందని, ఆ సర్వే సంస్థల ద్వారా డేటాను ఐటీ గ్రిడ్‌ సేకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డేటాను సమీకరించేందుకు ఎవరెవరు సహకరించి ఉంటారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

ఇదిలావుండగా ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్ద లభ్యమైన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదేనని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జి.కె. ద్వివేది స్పష్టంచేశారు. పబ్లిక్‌ డొమైన్‌లో ఉండే వివరాలు ఎవరైనా తీసుకొనే వీలుందని చెప్పారు. డేటా వివాదంపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలతో తమకు సంబంధం లేదన్నారు. ఎన్నికల ఉద్యోగులు తప్పుచేసినా క్రిమినల్‌ చర్యలతో పాటు సస్పెండ్‌ చేస్తున్నామని చెప్పారు. ఓటరు జాబితాలో ఆధార్‌, బ్యాంకు ఖాతా లింకు సమాచారం ఉండదని, ఇతర సంక్షేమ పథకాల సమాచారం కూడా ఏదీ ఉండదని ద్వివేది స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల మంది బూత్‌ లెవెల్‌ అధికారులు ఉండగా వారిలో ఎవరో ఒకరు పొరపాటు చేసే అవకాశం ఉందన్నారు.

ఓట్లు తొలగించాలంటూ వారం రోజుల క్రితం వరకు రోజుకు లక్ష దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు గణనీయంగా తగ్గాయని ద్వివేది తెలిపారు. ఓట్లు తొలగించాలంటూ తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు. కాగా, మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. మంగళవారం మరోసారి తనిఖీలు చేపట్టారు. అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ కేసులో కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు అశోక్‌ కోసం గాలింపు చేపట్టారు. ఎస్సార్‌నగర్‌ పరిధిలో రెండు ప్రత్యేక బృందాలతో పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతని‌ ఆచూకీ కోసం రంగంలోకి దిగారు.

ఇప్పటికే సంస్థ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి హార్డ్ డిస్క్‌లు, పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏపీ ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారం ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. డేటా చౌర్యం అంశంపై వైకాపా అధినేత వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మంగళవారం నెల్లూరులోని ఎస్‌వీజీఎస్‌ కళాశాల మైదానంలో జరిగిన వైకాపా సమర శంఖారావ సభలో ఆయన మాట్లాడారు. ప్రజల బ్యాంకు ఖాతాలు, చెక్కుల వివరాలు సీఎం చంద్రబాబుకు తెలుసని, ప్రజల ఆధార్‌ సమాచారం సైతం ఆయన వద్ద ఉందని ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన సున్నితమైన విషయాలు ప్రైవేటు సంస్థలకు ఎలా చేరాయని ప్రశ్నించారు. ప్రజల డేటాను ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబు చేసిన నేరం చాలా తీవ్రమైందన్నారు.

ఐటీ, బ్లూఫ్రాగ్‌ సంస్థలు ప్రైవేటు కంపెనీలని, తెదేపాకు సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను ఆ కంపెనీలే తయారు చేశాయని చెప్పారు. ఈ కంపెనీలు ఎవరివి? ఎవరు పెట్టించారు? అని జగన్‌ ప్రశ్నించారు. ఫారం -7 ఇచ్చి దొంగ ఓట్లు తీసేయాలని తామే కోరామని, అందులో తప్పేముందన్నారు. చంద్రబాబుకు ఓటు వేయరని తెలిస్తే అలాంటి వ్యక్తులను చంపేస్తారేమోనని జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో డేటా చౌర్యం కేసు వ్యవహారంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

అజెండా అంశాలతో పాటు రాజకీయ అంశాలపైనా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. సమాచార చౌర్యం, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపైనా ప్రధానంగా చర్చించారు. సమాచార చౌర్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలనే విషయంపైనా చర్చించారు. ఈ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు మాట్లాడాలని సీఎం మంత్రులకు చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా వీటిపై న్యాయపరంగా ఉన్న అవకాశాలనూ పరిశీలించాలని సూచించారు. ఓట్ల తొలగింపు అంశం సైతం మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది.

ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామని మంత్రివర్గం స్పష్టంచేసింది. పొరుగు రాష్ట్రం అనుసరిస్తున్న తీరుపై తీవ్రంగా ఆక్షేపించింది. తెలంగాణ ప్రభుత్వం తీరును తేలిగ్గా వదలొద్దని నిర్ణయించారు. మంత్రులు, సీనియర్లతో చర్చించి కార్యాచరణ రూపొందిద్దామని సీఎం స్పష్టంచేశారు. తెదేపా డేటాను దొంగిలించి ప్రత్యర్థులకు అప్పగించారని, దాన్ని కప్పిపుచ్చుకొనేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర పోలీసులపై మరో రాష్ట్ర పోలీసులు ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు.

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేసిన వ్యాఖ్యలపైనా ఈ భేటీలో పలవురు ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేవలం కోర్టుల్లో కేసులు వేసి ఊరుకోకుండా వాటిని ఫాలో అప్‌ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాటిని సాధించే దిశగా దిశానిర్దేశం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. అలాగే అగ్రిగోల్డ్‌ వ్యవహారంపైనా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మగా వచ్చిన రూ.250కోట్లను రూ.10వేల లోపు డిపాజిట్‌దారులకు పారదర్శకంగా కోర్టు ఆదేశానుసారం పంచాలని నిర్ణయించారు.

ఇంకోవైపు, ఫాం -7 దుర్వినియోగంపై అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని మంగళవారం కలిసిన మంత్రులు అమరనాథ్ రెడ్డి, ఫరూక్, సుజయకృష్ణ రంగారావు ఫిర్యాదు చేశారు. దురుద్దేశంతో ఓట్లను తొలగించమని ఫాం 7 దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు తమ ఫిర్యాదులో కోరారు.