• సమాంతర చర్చల వల్లే సరఫరా ఆలస్యం: రాహుల్

  • ప్రధానమంత్రిపైనా దర్యాప్తు జరుపాలని డిమాండు

  • ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాల తీవ్ర విమర్శలు

  • ప్రతిపక్షాల ఆరోపణలపై ఎదురుదాడికి దిగిన బీజేపీ

న్యూఢిల్లీ, మార్చి 7 (న్యూస్‌టైమ్): విపక్షాలు మరోమారు నరేంద్రమోదీ సర్కారు లక్ష్యంగా విమర్శల దాడికి దిగాయి. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో ఎన్డీయే అడ్డగోలుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ విమానాల సరఫరా ఆలస్యమవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీయే కారణమని, రాఫెల్ ఒప్పందంపై మోదీ నేరుగా చర్చలు జరుపడం వల్లనే ఈ విమానాల సరఫరా ఆలస్యమైందని ఆయన ఆరోపించారు. రాఫెల్ ఒప్పంద పత్రాల చోరీ వ్యవహారంలో ఇతరులపై దర్యాప్తు జరుపుతామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం మోదీపై ఎందుకు దర్యాప్తు జరపడంలేదని ప్రశ్నించారు.

రాఫెల్ ఒప్పందంలో రూ.30 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణను రాహుల్ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో మోదీని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందానికి మోదీ బైపాస్ సర్జరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘అందరికీ న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలి. రాఫెల్ ఒప్పందంపై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) సమాంతర చర్చలు జరిపినట్టు అధికారిక ఫైళ్లు స్పష్టం చేస్తున్నందున మోదీపై కూడా దర్యాప్తు జరపాలి. రాఫెల్ యుద్ధవిమానాల సరఫరా ఆలస్యమవడానికి ఈ సమాంతర చర్చలే కారణం’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

అనిల్ అంబానీకి రూ.30 వేలకోట్లు కట్టబెట్టాలని మోదీ భావించడం వల్లనే ఈ విమానాలు త్వరగా సరఫరా కాలేదని అనుమానం వ్యక్తంచేశారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు రక్షణ శాఖ నుంచి చోరీ అయ్యాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు చెప్పడంపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధరలు, బీమా కల్పిస్తామని, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని నిర్మూలిస్తామని ఇచ్చిన హామీల మాదిరిగానే రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు కూడా మాయమయ్యాయా? అని రాహుల్ ప్రశ్నించారు. ‘‘గాయబ్ హో గయా అనేది మోదీ ప్రభుత్వ కొత్త ట్యాగ్‌లైన్.

నిన్న ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మీడియాపై దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం చెప్పింది. కానీ రూ.30 వేలకోట్ల కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారిపై మాత్రం దర్యాప్తు జరపడంలేదు’’ అంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. మరోవైపు, రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని మోదీ సర్కారు చెప్పడం సిగ్గుచేటని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితోపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వ తీరు చాలా విచిత్రంగా ఉందని, కాపలాదారు (చౌకీదార్) బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరమని మాయావతి విమర్శించారు.

రాఫెల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురవడం ఆందోళనకరమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇదంతా వట్టి బూటకమని ధ్వజమెత్తారు. ఇంకోవైపు, అధికార పార్టీ లక్ష్యంగా విపక్షాలు చేస్తున్న విమర్శలపై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికి దిగింది. రాహుల్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, భారత భద్రతా బలగాల కంటే పాకిస్థాన్‌నే ఎక్కువగా విశ్వసించడం ద్వారా రాహుల్ పాక్‌లో మరింత టీఆర్పీని (టెలివిజన్ రేటింగ్స్‌ను) పొందుతున్నారని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. మీడియాకు వ్యతిరేకంగా అధికార రహస్యాల చట్టాన్ని ప్రయోగించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం గర్హనీయమని ఎడిటర్స్ గిల్డ్, ఇతర జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నాయి.

రాఫెల్ ఒప్పందం తీరుపై మీడియాలో వచ్చిన కథనాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఖండించాయి. ఈ అంశంలో మీడియాకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. మీడియా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించే ఎలాంటి చర్యలను తీసుకోరాదని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్‌క్లబ్, ప్రెస్ అసోసియేషన్ కూడా అటార్నీ జనరల్ వ్యాఖ్యలను ఖండించాయి.

అధికారంలో ఉన్న వారితో నిమిత్తం లేకుండా ప్రజా ప్రయోజనాలు, నైతిక ప్రమాణాలకు కట్టుబడి మీడియా బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపాయి. కేంద్రం చర్యల్ని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ఖండించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here