• మహిళాభ్యున్నతికి కట్టుబడ్డామన్న ముఖ్యమంత్రులు

హైదరాబాద్, మార్చి 8 (న్యూస్‌టైమ్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఇచ్చిన ఓర్పు అనే బహుమతితో మహిళలు ఎన్నో గొప్ప బాధ్యతలను మోస్తున్నారని ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రశేఖర్‌రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు స్వయంసమృద్ధి సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వయం సాధికారత దిశగా సమాజం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ పసుపు, కుంకుమ కానుకను అందజేస్తున్నామన్నారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు ఇచ్చింది. ఈ మేరకు గురువారం సీఎస్ సచివాలయంలోని అన్నిశాఖలకు, శాఖాధిపతులకు, జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీచేశారు.