ముంబయి, మార్చి 8 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ గ్రూపు గడిచిన నెలలో రూ.302 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. వీటిలో రూ.187 కోట్ల విలువైన ఆర్డర్లు గ్రూపునకు చెందిన సబ్సిడరీ సంస్థ అయిన పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు రాగా, మిగతా రూ.115 కోట్ల విలువైన ఆర్డర్ పెన్నార్ ఇంజినీరింగ్ బిల్డింగ్ సిస్టమ్‌కు వచ్చినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ గురువారం మీడియాకు తెలిపారు.

వచ్చే 7 నుంచి 12 నెలల్లోగా ఈ ఆర్డర్లను సరఫరా చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇదిలావుండగా, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రుణాలను తగ్గించుకునే పనిలో పడింది. వచ్చే మూడు నుంచి నాలుగు నెలల కాలంలో రెండు అనుబంధ సంస్థల్లో వాటాలను, నిరూపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల వరకు నిధులు సమకూరవచ్చునని తెలిపింది. ఇందుకోసం రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌ఎన్‌ఏఎం)లో ఉన్న 43 శాతం వాటాను, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్‌జీఐఎల్)లో ఉన్న 49 శాతం వాటాను విక్రయించడానికి సిద్ధమైంది.

రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థే ఆర్‌జీఐఏఎల్. ఈ లావాదేవీలు పూర్తయితే కంపెనీ మొత్తం అప్పులో 50-60 శాతం వరకు తగ్గనుంది. ప్రస్తుతం రూ.5 వేల కోట్ల నికర విలువ కలిగిన ఆర్‌ఎన్‌ఎంలో రిలయన్స్ క్యాపిటల్‌కు 43 శాతం వాటా ఉంది. అలాగే ఆర్‌జీఐసీఎల్‌లో వాటా విక్రయానికి సంబంధించి ఇప్పటికే మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకుంది కూడా. నిరూపయోగంగా ఉన్న ఆస్తుల విక్రయం కూడా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నదని తెలిపింది. తాజా నిర్ణయంతో అనిల్ అంబానీకి కొంత వరకు ఆర్ధిక కష్టాలు తీరనున్నాయి.