మచిలీపట్నం, మార్చి 18 (న్యూస్‌టైమ్): ఎన్నికలలో ధనం, మద్యం ప్రభావం నియంత్రణకై సంబంధిత వ్యయ నియంత్రణ టీములు పటిష్టవంతంగా పని చేయాలని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి ఎఎండి ఇంతియాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ నియోజక వర్గాల ఎన్నికల వ్యయపరిశీలకులు జిల్లా కలెక్టరును కలిశారు. ఈ సందర్బంగా వ్యయ పరిశీలకులు జిల్లా ఎస్‌పీ, ఎన్నికల వ్యయ నిర్వహణ నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి సమీక్షించారు.

జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలుకు మండల వారీ టీములు ఏర్పాటు చేశారని, అదే విధంగా ఎన్నికల వ్యయ నియంత్రణ టీములు తదితర అంశాలపై టీములు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికలలో ధనం, మద్యం ప్రభావం తగ్గించేందుకు ఈ టీములు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలు టీములు 25 వేల పైగా పోస్టర్లు, వాల్ రైటింగ్‌లు, బ్యానర్లు తొలగించారని అన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఎదురుమొండి దీవులలో 5 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టరు తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లా కలెక్టరుతో కలసి సోమవారం కలెక్టరేట్ కాంపౌండ్‌లోని సి విజిల్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరిస్తూ జిల్లా నియంత్రణ కేంద్రంలో సి విజిల్, 1950 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తనా నియమావలి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టరు వివరించారు. ఫిర్యాదు రాగానే సంబంధిత ఆర్వోకు, ప్లైయింగ్ స్వ్యాడ్‌లకు సమాచారం చేరవేసి ఉల్లంఘనల నియంత్రణ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సి విజిల్ ద్వారా ఇప్పటి వరకు 72 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 1950 కాల్ సెంటర్ ద్వారా ఎన్నికల సంబంధిత సమాచారం పౌరులకు అందిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికలలో అభ్యర్దులు ఎన్నికల క్యాంపైన్ నిర్వహణ వ్యయం పెయిడ్ ఆర్టికల్ వ్యయం తదితర అంశాలపై ఎన్నికలు వ్యయం నమోదుకు ఎంసిఎంసి సెంటరును ఏర్పాటు చేసినట్లు కలక్టరు ఎన్నికల వ్యయ పరిశీలకులకులకు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ఐఆర్ఎస్ అధికారులను జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించిందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డిఆర్వో ఎ. ప్రసాద్, ట్రైజరీ నాగరమేష్, డిప్యూటీ కలెక్టరు ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.