పనాజీ, మార్చి 18 (న్యూస్‌టైమ్): అధికార భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ మరణంతో గోవా రాజకీయాలు మరోమారు తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో తమకు మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ జోక్యంతో గవర్నర్ బలం లేనప్పటికీ బీజేపీ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు గతంలో ఆహ్వానించారని, కనీసం పరిస్థితులను ఇప్పటికైనా అర్ధంచేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు సోమవారం గవర్నర్‌ మృదుల సిన్హాను కలిసేందుకు రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లారు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మృతి చెందడంతో ఆ సంకీర్ణ ప్రభుత్వ బలం 12కు పడిపోయిందని, తమ పార్టీకి 14 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం తమదే పెద్ద పార్టీ కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సోమవారం ఉదయం పనాజీలో జరిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసేందుకు నిరసన యాత్ర నిర్వహించారు.

ప్రతిపక్షనేత చంద్రకాంత్‌ కావ్లేకర్‌ సారధ్యంలో వీరంతా గవర్నర్‌ను కలుస్తామని, అపాయింట్‌మెంట్‌ కావాలని అడిగినప్పటికీ ఆయన నిరాకరించడంతో 14 మంది ఎమ్మెల్యేలతో కాలినడకన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గోవాలో 40 శాసనసభ స్థానాలున్నాయి. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుభాశ్‌ శిరోద్కర్‌, దయానంద్‌ సోప్తి గత సంవ్సరం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌ పారికర్‌ ఆదివారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. మరో భాజపా ఎమ్మెల్యే ఫ్రాన్సిస్‌ డిసౌజా కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోవా శాసనసభలో 36 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.

వారిలో 14 మంది కాంగ్రెస్‌కి చెందిన వారు కాగా, ముగ్గురు స్వతంత్రులు భాజపాకు మద్దతు ఇస్తున్నారు. ఈ ముగ్గురిని కలుపుకొంటే భాజపాకు ప్రస్తుతం 12 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. అయితే, గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇంకా తేలాల్సి ఉంది. ముఖ్యమంత్రి మరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారాన్ని సంతాప దినంగా ప్రకటించడం, అదే రోజు విపక్ష కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు కోరుతూ నిరసనకు సిద్ధపడ్డం యాదృశ్చికమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here