పనాజీ, మార్చి 18 (న్యూస్‌టైమ్): అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్‌ పారికర్‌ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ మేరకు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రక్షణ శాఖను కోరుతూ లేఖ రాసింది. మిరామర్‌ బీచ్‌లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్‌ బండోద్కర్‌ స్మారకం పక్కనే పారికర్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

ఆదివారం మృతిచెందిన పారికర్‌ పార్థివదేహాన్ని పనాజీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి కార్యకర్తలు, నాయకుల సందర్శించేందుకు వీలు కల్పించారు. పార్టీ నేతలు నివాళులర్పించిన అనంతరం ప్రజల సందర్శనార్థం పారికర్‌ భౌతికకాయాన్ని కాలా అకాడమీకి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పారికర్‌ అంతిమయాత్ర ప్రారంభమయింది. సాయంత్రం 5 గంటలకు మిరామర్‌ బీచ్‌లో అంతిమ సంస్కారాలు జరిగాయి. పారికర్‌ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

గతకొంతకాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న మనోహర్‌ పారికర్‌ ఆదివారం సాయంత్రం 6.40గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లపాటు రక్షణ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు పారికర్. నిరాడంబరత, నిజాయతీకి నిలువుటద్దంగా, మితవాద నేతగా ప్రశంసలు అందుకున్నారు. అంతకముందు, మనోహర్‌ పారికర్‌ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు.

సోమవారం మధ్యాహ్నం పనాజీ చేరుకున్న ప్రధాని మోదీ కాలా అకాడమీకి వెళ్లి పారికర్‌కు అంజలి ఘటించారు. అనంతరం పారికర్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా పారికర్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంతకుముందు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, పలువురు భాజపా నేతలు పారికర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పారికర్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పారికర్‌ను గుర్తుచేసుకున్న స్మృతి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

Prime Minister Narendra Modi pays homage to former Goa Chief Minister Manohar Parrikar, who passed away battling pancreatic ailment yesterday, in Panaji, Monday, March 18, 2019.

మరోవైపు, మనోహర్‌ పారికర్‌ మృతికి అమెరికా, రష్యా తదితర దేశాలు కూడా సంతాపం ప్రకటించాయి. ‘‘పారికర్‌ మృతి విచారకరం. ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఓ గొప్ప నేత, రాజనీతజ్ఞుడిని భారత్‌, భారతీయ జనతా పార్టీ కోల్పోయింది.

పారికర్‌ రాజకీయ, సామాజిక జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం’’ అని భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుదాషెవ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అధికార, విపక్షాలన్న తేడా లేకుండా గోవాలోని దాదాపు అన్ని పార్టీల నాయకులూ పారికర్‌కు సంతాపం వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here