న్యూఢిల్లీ, మార్చి 18 (న్యూస్‌టైమ్): మొత్తానికి సాధారణ ఎన్నికల సమరానికి అధికారికంగా తెరలేచింది. లోక్‌సభ ఎన్నికల తొలి దఫా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీచేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. దీంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, ఐక్యంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలకు మధ్య హై-ఓల్టేజీ సమరానికి తెర లేచినట్లయింది.

తొలి దఫాలో ఏప్రిల్ 11న 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేసిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం జారీచేసింది. దీంతో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 91 నియోజకవర్గాల్లో మొత్తం ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలుస్తారన్న విషయం ఈ నెల 28వ తేదీ సాయంత్రానికి తెలుస్తుంది. తొలి విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.

వీటిలో ఆంధ్రప్రదేశ్ (25 సీట్లు), తెలంగాణ (17), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్‌ప్రదేశ్ (2), మేఘాలయ (2), మిజోరం (1), నాగాలాండ్ (1), సిక్కిం (1), అండమాన్ అండ్ నికోబార్ (1), లక్షద్వీప్ (1) ఉన్నాయి. అలాగే తొలి విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, బీహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 2 నియోజకవర్గాలతోపాటు జమ్ముకశ్మీర్‌లోని జమ్ము, బారాముల్లా నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే యూపీలో మొత్తం 80 లోక్‌సభ సీట్లు ఉండగా, బీహార్‌లో 42, పశ్చిమ బెంగాల్‌లో 40 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. తొలి దఫా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులతో పాటు మిగిలిన ఆరు విడతల్లో తలపడనున్న ఔత్సాహిక అభ్యర్ధులు కూడా ముందునుంచే ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here