ఇస్తాంబుల్‌, మార్చి 21 (న్యూస్‌టైమ్): పౌర విమానయాన రంగంలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారత్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ ఎయిర్‌వేస్ ‘ఇండిగో ఎయిర్‌లైన్స్‌’ ఇప్పుడు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. 20 నుంచి 25 ఎయిర్‌బస్‌ ఎ321 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్ధిక వనరులను సమకూర్చుకుంటోంది. త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ సంస్థ మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో కొత్తగా మరో 48 విమానాలను తీసుకోనుంది. వీటిల్లో 25 ఎ321 మోడళ్లను తీసుకోగా మిగిలినవి ఎ320 మోడల్‌ను తీసుకోనుంది. ‘ఇండిగో’ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విల్లీ బౌల్టర్‌ ఇస్తాంబుల్‌లోని ఇండిగో మెయిడెన్‌ ఫ్లైట్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతుం రోజుకో సర్వీసును నడుపుతున్నాం. ఈ నెల తర్వాత నుంచి రెండో సర్వీసును కూడా ఏర్పాటు చేస్తాము. మధ్యశ్రేణి దూరాలకు సర్వీసులను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నాము.

చైనా, వియత్నాం, సౌదీ మార్గాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పటికే గాట్విక్‌లో స్లాట్‌ వచ్చినా వాటిని వినియోగించుకోలేకపోయాము’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ‘ఇండిగో’కు టర్కిస్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం ఉంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకునే పనిలో ఆ సంస్థ యాజమాన్యం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here