హైదరాబాద్, మార్చి 21 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి తీక్షణ వీక్షణాన్ని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చిలోనే రోహిణి కార్తెను మరిపించే స్థాయిలో ఎండ వేడిమితోపాటు వడగాలులు వీస్తున్నాయి. ప్రధాన నగరాల్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత దాటి మరీ నమోదు కావడం విశేషం. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరులలో గురువారం గరిష్టంగా 42 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల మార్చిలోనే ఎండలు తీవ్రంగా ఉంటాయని, మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చంటున్నారు.

రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 3 నుండి 4 డిగ్రీలు అదనంగా నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుండి క్రమేపీ ఎండ వేడిమి పెరగడంతో అనేక చోట్ల రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థినీ విద్యార్థులు మధ్యాహ్నం వేళ ఆయా పరీక్షా కేంద్రాల నుండి బయటకు వచ్చి వేడిమిని భరించలేక ఆపసోపాలు పడుడుతున్నారు. అత్యవసర పనులపై వచ్చే వాళ్లు తలకు టోపీలు, చెవులకు చేతిరుమాళ్లను కట్టుకుని తిరగడం కనిపించింది. మహిళలు, యువతలు, వృద్ధులు గొడుగులను ఆశ్రయించారు.

పలు ప్రాంతాల్లో కొబ్బరిబొండాల అమ్మకాలు జోరుగా సాగాయి. అలాగే శీతలపానీయాలు, చెరకు రసం విక్రయ కేంద్రాలు రద్దీగా కన్పించాయి. సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కూడా వీచాయి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుండి 3 గంటల మధ్యలో ఆరుబయట సంచరించకుండా ఉండడమే మేలని వైద్యులు చెబుతున్నారు. అధికంగా నీళ్లతోపాటు పండ్ల రసాలను తీసుకోవాలని తెలిపారు. మరీ చల్లగా ఉండే ఫ్రిజ్‌వాటర్‌, ఇతర శీతలపానీయాలను సేవించకూడదని సూచిస్తున్నారు. తెల్లని, నూలు వస్త్రాలను ధరించాలని, ఎండ దెబ్బ తగిలినట్లు భావిస్తే సమీపంలోని వైద్యులను సంప్రదించాలంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here