• ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా…

న్యూఢిల్లీ, మార్చి 21 (న్యూస్‌టైమ్): వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు. మరి నీటి సమస్య అంత విసృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నేల తల్లి నెర్రెలిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. ప్రపంచంలో 80 దేశాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.

భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రాల వాటా 97 శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో 0.008 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు. క్రీశ 2025 నాటికి 48 దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్‌ హాప్కిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్ హెచ్చరించింది. 3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్నారు. నీటిమూలంగా సంభవించిన 43 శాతం మరణాలకు అతిసారవ్యాధే కారణం. పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14 ఏళ్ల లోపువారే. 98 శాతం మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే.

భూమిమీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకునేలా వున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికివాడల్లో నివసించే ఒక వ్యక్తి రోజు మొత్తం మీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్‌ స్నానానికి వాడే నీటితో సమానం. లీటరు నీటికి మురికివాడల్లో నివసించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10 రెట్లు అధికధర చెల్లిస్తున్నారు. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు. ప్రతి 15 సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితో చనిపోతోంది. లక్షలాది మంది మహిళలు, పిల్లలు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాలనుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు.

  • నీటి కోసం ఒక రోజును ఎందుకు కేటాయించారు?

నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువెనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునేవారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.

భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ, మేఘా లుగా మారుతూ, వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు డెనోసార్లు ఎంగిలి చేసిన నీటినే ఇప్పుడు మనం కూడా తాగుతున్నామన్నమాట. భూమ్మీద మూడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97 శాతం ఉప్పునీరే. కేవలం 3 శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2 శాతం మంచురూపంలో ఉంది. మిగతా ఒక శాతం నీరులో 0.59 శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదులు, సరస్సుల్లో ప్రవహిస్తోంది. ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు.

అమెరికాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే, ఆఫ్రికాలోని గాంబియా దేశంలో ఒక వ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియాలాంటి చాలా దేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు. ఎక్కడెనా కొళాయిల్లోంచి నీరు వృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెంటనే కట్టేయండి. షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్‌ నీళ్లతో చేయండి. దీని వల్ల రోజులో 150 లీటర్ల నీటిని కాపాడవచ్చు. పళ్లు తోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడం వల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది.

టాయిలెట్‌ ఫ్లష్‌లో సుమారు 8 లీటర్ల నీరు పడుతుంది. లీటర్‌ నీరు పట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్న చిన్న రాళ్లు నింపి, టాయ్‌లెట్‌ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండు లీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి. కొళాయిలకి లీకేజీలు ఉంటే దానిని అరికట్టండి. దీనివల్ల నెలలో 300 గ్యాలన్ల నీరు ఆదా అవుతాయి. స్కూల్లో, మీ ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచండి… ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కూడా మనవంతుగా కొంత వరకు నీటిని ఆధాచేయవచ్చు.

ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ప్రపంచంలోని మంచినీటిలో 70 శాతాన్ని వ్యవసాయంలో, 22 శాతం పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. అర కిలో కాఫీ తయారవడానికి 11,000 లీటర్ల నీరు అవసరం. ప్రపంచంలో నీటిపై జరుగుతున్న వ్యాపారం విలువ 400 బిలియన్‌ డాలర్లు. భారత్‌లో ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాగడానికి సరిపడా శుభ్రమైన నీరు కూడా లభించని పరిస్థి తులు నెలకొనవచ్చని ఇటీవలనే ఐరాస భారత్‌ను హెచ్చరించింది.

నీటి వినియోగంలో సామాజిక, ఆర్థిక అసమానతలను చక్కదిద్దేందుకు గానూ తలసరి నీటి వనరుల లభ్యతపై భారత్‌ పునరాలోచించాలని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. అందుబాటులో వున్న నీటి వనరులను లెక్కించేందుకు కొత్త సూచీలను భారత్‌ రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది. ఎందుకంటే తలసరి నీటి లభ్యతకు సంబంధించిన గణాంకాల్లో నీటి కేటాయింపులో, లభ్యతలో అసమానతలను పొందుపరచలేదు. నీటి లభ్యతకు, వినియోగానికి ప్రధాన నిర్ణయాక అంశంగా ఈ అసమానతలను గుర్తించారు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలతో నీటి కొరత బాగా పెరుగుతోంది. అందువల్ల దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆ నివేదిక పేర్కొంది.

‘భారతదేశంలో నీరు: పారిశు ధ్యం, అవకాశాలు’ అనే అంశంపై యునిసెఫ్‌, ఆహార, వ్యవసాయ సంస్థలు ఈ నివేదికను వెలువరించాయి. నీటి లభ్యతలో నెలకొన్న అంతరాలను గుర్తు పట్టి వెల్లడించే సామర్ధ్యం గల కొత్త సూచీలను వృద్ధి చేయాల్సి వుందని ఆ నివేదిక సూచించింది. ప్రపంచ జనాభాలో భారత్‌ జనాభా 16 శాతంగా వుంది. కానీ, ప్రపంచ నీటి వనరుల్లో భారత నీటి వనరులు కేవలం నాలుగు శాతంగానే ఉన్నాయి. ప్రస్తుతమున్న వెయ్యి మిలియన్ల జనాభాకు తలసరి నీటి లభ్యత సంవత్సరానికి ఒక్కో వ్యక్తికి 1.170 క్యూబిక్‌ మీటర్లుగా వుంది. తీవ్రంగా వున్న నీటి కొరత, నీటి వినియోగదారుల మధ్య అంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, ఇంటి అవసరాలకు వాడుకునే వారి మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి. అసలే నీటి లభ్యత తక్కువ, పైగా వున్న నీటిని పొదుపుగా, సమర్ధవంతంగా వాడుకునే పద్ధతులు లేకపోవడంతో పేలవమైన పారిశు ధ్యానికి దారి తీస్తోంది.

ఇదే ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ, సామాజిక సవాలు. సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం కొరవడడాన్ని ఆర్ధిక, రాజకీయ, సామాజిక అసమానతలతో ముడిపెట్టవచ్చు. అలాగే కొన్ని గ్రూపులు, కమ్యూనిటీలపై వివక్షగా కూడా పేర్కొనవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here