న్యూఢిల్లీ, మార్చి 21 (న్యూస్‌టైమ్): నిజం. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక వెబ్‌సైట్‌లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు సంబంధించిన గత ఎన్నికల సమాచారం కొంత వరకు కనిపించకుండాపోయింది. సాంకేతిక లోపమో లేక మానవ తప్పిదమో? కారణం ఏదైనప్పటికీ జరిగిందేమిటో తెలియదు గానీ, కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://eci.gov.inలో డేటా మాయం అయి పరిశోధకులను అయోమయానికి గురిచేస్తోంది.

సాధారణంగా ఈసీ పోర్టల్‌లో దేశంలోని 29 రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల వివరాలు, గత ఎన్నికల సమగ్ర సమాచారం, అభ్యర్ధుల నామినేషన్లు, అఫిడవిట్ల పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఏ ఏ రాష్ట్రాలకు ఏ ఏ సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి? ఉప ఎన్నికలు ఎప్పుడెప్పుడు అయ్యాయి? ఆయా ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఏవి? పోటీ చేసిన వారిలో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి? మొత్తంగా పార్టీల వారీగా ఓటింగ్ శాతం తదితర సమాచారం అంతా లభిస్తుంటుంది.

ఈ డేటాను ప్రామాణికంగా తీసుకునే పరిశోధక విద్యార్ధులు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉంటారు. కానీ, అలాంటి ప్రాధాన్యత కలిగిన వెబ్ పోర్టల్‌లో అసంపూర్ణ సమాచారమా? బహుశా, దీన్ని ఎవరూ ఊహించి కూడా ఉండరు. డేటా చౌర్యం, ఓట్ల తొలగింపు వంటి మాటలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారే తప్ప అసలు ఇంతటి ముఖ్యమైన దాని గురించి కనీసం మాట్లాడిన వాళ్లే లేకుండాపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమాచారాన్నే (https://eci.gov.in/assembly-election/assembly-election/సైట్‌లోకి వెళ్లి) పరిశీలిస్తే, (Menuలోకి వెళ్లి Past Assembly Elections కేటగిరీ క్లిక్ చేస్తే… వచ్చే) గత ఎన్నికల (పాస్ట్ ఎలక్షన్స్) కేటగిరీలో 2009 నుంచి డేటా కనిపిస్తుంది.

ఆ ఏడాది హర్యాణ, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు, 2010లో బిహార్‌కు, 2011లో అస్సాం, కేరళ, పాండిచేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు, 2012లో హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు, 2013లో చత్తీస్‌గర్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు, 2014లో ఝార్ఖండ్, జమ్మూ, కశ్మీర్, హర్యానా, మహారాష్ట్రకు, 2015లో బిహార్, ఢిల్లీ రాష్ట్రాలకు, 2016లో అస్సాం, కేరళ, పాండిచేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు, 2017లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు, ఇక, 2018లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికలు జరిగినట్లు సమాచారం లభిస్తోంది.

కానీ, గత సారి (2014)లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు ఎన్నికలు జరిగినట్లు పైన పేర్కొన్న పాస్ట్ ఎలక్షన్స్ విభాగంలో ఎక్కడా సమాచారం కనిపించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here