• బరిలో హేమాహేమీలు

  • కాకరేపుతున్న కల్యాణ్

  • ఆకట్టుకునేలా ‘పల్లా’ ప్రచారం

  • ఈసారైనా గెలిపించండంటూ నాగిరెడ్డి

  • ‘మేయర్’ సేవల స్ఫూర్తితో పనిచేస్తానన్న ‘పులుసు’

  • సాధారణ ఎన్నికల్లో ఆకర్షణగా నిలిచిన ‘గాజువాక’

    విశాఖపట్నం, మార్చి 22 (న్యూస్‌టైమ్): రాష్ట్ర రాజకీయాలకు విశాఖ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తెలుగుదేశం తాజా ఎన్నికల్లో మరోసారి తన ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కూడా విశాఖనే కీలకంగా ఎంచుకుంది.

మూడు పార్లమెంట్ (విశాఖపట్నం, అనకాపల్లి, అరకు) సీట్లు సహా ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాలలో సాధ్యమైనంత మేరకు ఎక్కువ సంఖ్యలో స్ధానాలను తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహరచన చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గెలుపు గుర్రాలను ఎంపికచేసి బీ ఫారాలతో బరిలోకి దించింది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ కూడా ఈసారి తన సత్తాచాటుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక, పారిశ్రామిక రాజధాని విశాఖనే ఎంపికచేసుకుంది.

ఇక్కడ ముందు నుంచీ వైసీపీకి ఉన్న బలాన్ని, కాలక్రమంలో పెరుగుతూ వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక ఓటునూ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. ఇక, కొత్తగా ఈ ఎన్నికల సంగ్రామంతోనే తమ పార్టీ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న సినీ నటుడు పవన్ కల్యాణ్ సైతం విశాఖనే ఎంపికచేసుకున్నారు. అందులో భాగంగా స్వయంగా ఆయన ఇక్కడి గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ నియోజకవర్గం పతాక శీర్షికల్లో నిలిచింది.

ఎంపీ అభ్యర్ధుల విషయానికి వస్తే తెలుగుదేశం నుంచి ప్రముఖ విద్యావేత్త, గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్ నుంచి పేడాడ రమణకుమారి వంటి వారు ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈసారి ఎన్నికల్లో గాజువాకది ప్రత్యేక స్థానం.

ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకే తెదేపా మరోసారి అవకాశం ఇవ్వగా, వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన తిప్పల నాగిరెడ్డినే ఈ ఎన్నికల్లోనూ టికెట్ వరించింది. ఇక్కడ టికెట్ దక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యకు పెందుర్తి సీటు కేటాయించి ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు పోటీచేస్తున్నారు. గత (2014) ఎన్నికల్లో గాజువాక నుంచి తెలుగుదేశం అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావు పోటీచేసి గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన పార్టీల నుంచి ఐదుగురు పోటీ చేయగా అందులో పల్లా శ్రీనివాసరావు మూడో వారు. అప్పారి జోసఫ్ స్టాలిన్ (సీపీఐ), సీహెచ్ నర్సింగరావు (సీపీఎం), సీహెచ్ ప్రసాద్ గాంధీ (బీఎస్‌పీ), వై. సుధాకర్ నాయుడు (కాంగ్రెస్) నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక, అదే ఎన్నికల్లో రిజిస్ట్రేషన్ కలిగినప్పటికీ ఈసీ గుర్తింపు లేని పార్టీల నుంచి ఆరుగురు బరిలో నిలిచారు. అందులో వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి ఒకరు. స్వతంత్రులు మరో ఆరుగురు కూడా పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. అయితే, ఈసారి మాత్రం నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. పల్లా శ్రీనివాసరావుకు ఎంపీగా ప్రమోషన్ వస్తుందని ఆయన అభిమానులు ఆశించినప్పటికీ చివరికి పార్టీ అధిష్ఠానం మాత్రం బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ వైపే మొగ్గుచూపింది.

ముందునుంచీ గాజువాక ఎమ్మెల్యే స్థానం నుంచే పోటీచేయాలని భావించిన పల్లాకు ఇది ఊహించని ఊరటగానే భావించాలి. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించకముందు వరకూ తిప్పల నాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీచేసేందుకు ఆసక్తిచూపించడం లేదని ప్రచారం జరిగినప్పటికీ చివరికి జగన్ మాత్రం ఆయన్నే బరిలోకి దింపేందుకు ఒప్పించారు. మరోవైపు, బీజేపీ నుంచి పులుసు జనార్ధనరావు రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తను మేయర్‌గా పనిచేసినప్పుడు చేపట్టిన ‘మంచి’ ఈసారి తనకు కలిసొస్తుందని ఆయన ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో గెలుపు అంత సులువు మాత్రం కాదు. పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉంది. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ ఏ స్థానాన్ని తీసుకున్నా పరిస్థితిలో భిన్నత్వం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

1 COMMENT

  1. I simply want to mention I am newbie to blogging and site-building and definitely savored you’re blog site. Most likely I’m want to bookmark your site . You amazingly come with incredible writings. Cheers for sharing your blog site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here