• ప్రభుత్వ సాయం పొందేవాళ్లు అనర్హలట

  • వలసదారులకు వ్యతిరేకంగా కొత్త ప్రతిపాదన

వాషింగ్టన్: వలసదారుల విషయంలో అగ్రరాజ్యం అమెరికా తన కఠిన నిర్ణయాలను కొనసాగిస్తూనే ఉంది. గతంలో మాదిరిగానే గ్రీన్‌కార్డు విషయంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు గుర్రుగా ఉంది. ప్రభుత్వ సాయం పొందేవాళ్లకు గ్రీన్‌కార్డు పొందే అర్హతలేదంటూ అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుంది. అల్పాదాయ కారణాలతో ప్రభుత్వం నుంచి సాయం పొందే వలసదారులకు గ్రీన్‌కార్డులు (శాశ్వత నివాస అనుమతులు) ఇవ్వకూడదని ప్రతిపాదించింది. ఆ దేశ హోం ల్యాండ్‌ భద్రత మంత్రి కిర్స్ట్‌జెన్‌ నీల్సన్‌ సంతకం చేసిన ఈ ప్రతిపాదిత నిబంధనను సంబంధిత శాఖ వెబ్‌సైట్‌లో పెట్టారు.

దీని ప్రకారం వీసా స్థితిలో మార్పు, పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నవారు తాము ఇప్పటివరకూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులో వాటిని పొందబోమని రుజువు చేయాల్సి ఉంటుంది. ఆదాయ నిర్వహణకు నగదు సాయం, పేద కుటుంబాలు పొందే తాత్కాలిక సాయం, ఆదాయ భద్రత సాయం, మెడిక్‌ ఎయిడ్‌ వైద్య సాయం, ఆహార కొనుగోలు సాయం లాంటివన్నీ ప్రభుత్వ ప్రయోజనాల కిందకి వస్తాయి. ఈ ప్రతిపాదిత నిబంధనపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వాగతిస్తున్నామని నీల్సన్‌ తెలిపారు.

‘‘వలసదారుల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు, అమెరికా పన్ను చెల్లింపుదారులకు వారు భారంగా మారకుండా చూసేందుకు కాంగ్రెస్‌ చేసిన చట్టాన్ని ఈ కొత్త నిబంధన అమలుచేస్తుంది’’ అని చెప్పారు. అయితే, నిబంధన జారీ చేయడానికి ముందు దీనికి సవరణలు చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రతిపాదిత నిబంధన అమలైతే, అమెరికాలోని వేలాది మంది భారతీయులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అమెరికాలో 6.32 లక్షల మంది భారతీయ వలసదారులు గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని సిలికాన్‌వ్యాలీలోని టెక్‌ పరిశ్రమలు, రాజకీయ నాయకులు తీవ్రంగా తప్పబట్టారు. ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాహూ వంటి సంస్థల ప్రతినిధిగా ఉన్న ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్‌ సంస్థ చట్టబద్ధమైన వలసదారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఇటు హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల (హెచ్‌-4 వీసాదారుల) ఉద్యోగ అనుమతులు వచ్చే మూడు నెలల్లో రద్దు చేయాలని నిర్ణయించాలని శుక్రవారం అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.