న్యూఢిల్లీ, మార్చి 26 (న్యూస్‌టైమ్): మొత్తానికి ఐపీఎల్ తాజా సీజన్ మ్యాచ్‌లో మండుతున్న ఎండలకు మాదిరిగానే హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న జట్లు ఆశించినట్లు కాకపోయినా కొంత వరకు క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపు ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లక్ష్య ఛేదనలో నిలకడగా పరుగులు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్ 6 వికెట్ల తేడాతో డీసీ జట్టును మట్టికరిపించింది.

తోలుత టాస్ గెలిచిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ధవన్ (47 బంతుల్లో 51; 7 ఫోర్లు) మినహా మిగతా వారు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఆరంభంలో విఫలమైన చెన్నై బౌలర్లు ఆఖర్లో మాత్రం అదరగొట్టారు. ఢిల్లీ హిట్టర్లను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. రెండో ఓవర్‌లో పృథ్వీ (16 బంతుల్లో 24; 5 ఫోర్లు) వరుసగా మూడు ఫోర్లు కొట్టి జోరు చూపెట్టినా ఐదో ఓవర్‌లోనే చాహర్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. దీంతో తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండో ఎండ్‌లో ధావన్ జోరుగా ఆడటంతో పవర్‌ప్లేలో ఢిల్లీ స్కోరు 43/1కి చేరింది.

స్పిన్నర్ల రాకతో పరుగులు వేగం మందగించినా వన్‌డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ (18) వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్‌లో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఓవరాల్‌గా ఢిల్లీ తొలి 10 ఓవర్లలో 65 పరుగులు చేసింది. ఈ జంట కుదురుకున్న దశలో తాహిర్ రెండో దెబ్బ కొట్టాడు. 12వ ఓవర్‌లో టర్నింగ్ బంతితో అయ్యర్‌ను ఔట్ చేయడంతో రిషబ్ పంత్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులోకి వచ్చాడు. ధవన్, పంత్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగు తీసింది. ఈ ఇద్దరి ధాటికి ఢిల్లీ ఓ దశలో 120/2 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచినా తర్వాత చెన్నై బౌలర్ బ్రావో మ్యాచ్‌ను బాగా నియంత్రించాడు.

హర్భజన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి ఊపుమీదున్న పంత్‌ను 16వ ఓవర్ రెండో బంతికి ఔట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 41 పరుగులు నమోదయ్యాయి. ఇదే ఓవర్ నాలుగో బంతికి హిట్టర్ ఇంగ్రామ్ (2)ను పెవిలియన్‌కు పంపించాడు. మూడు బంతుల తేడాలో రెండు కీలక వికెట్లు పడటంతో ఢిల్లీ స్కోరుపై ప్రభావం చూపింది. ఓ ఎండ్‌లో స్థిరంగా పరుగులు సాధించిన ధవన్‌కు సహచరుల నుంచి సరైన మద్దతు లభించలేదు. 17వ ఓవర్‌లో జడేజా పాల్ (0)ను బోల్తా కొట్టించగా, సరిగ్గా మూడు బంతుల తర్వాత ధావన్ కూడా వికెట్ పారేసుకున్నాడు. చివర్లో అక్షర్ పటేల్ (9 నాటౌట్), టెవాటియా (11 నాటౌట్) భారీ షాట్లు కొట్టలేకపోయారు. దీంతో 15 ఓవర్లలో 118/2 స్కోరుతో ఉన్న ఢిల్లీ బ్యాట్స్‌మన్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 29 పరుగులే చేశారు.

ఇక, 148 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఛేదించింది. వాట్సన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రాయుడు (5) ఐదో బంతికే స్లిప్ క్యాచ్ నుంచి బయటపడ్డాడు. ఈ ఒత్తిడిని అధిగమించలేక మూడో ఓవర్‌లోనే వికెట్ సమర్పించుకున్నాడు. 21 పరుగులకే తొలి వికెట్ పడటంతో చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వాట్సన్ రబడ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఊపులోకొచ్చాడు. మూడోస్థానంలో వచ్చిన రైనా (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఇషాంత్ ఐదో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదడంతో 18 పరుగులు వచ్చాయి. ఈ ఇద్దరి జోరుతో పవర్‌ప్లేలో చెన్నై 58/1 స్కోరు చేసింది. ఈ దశలో ఇషాంత్, వాట్సన్, రబడ మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అంపైర్లు, కెప్టెన్ సర్ది చెప్పడంతో సద్దుమణిగింది.

ఆరో ఓవర్‌లో బౌలింగ్ ఛేంజ్ కోసం వచ్చిన మిశ్రాకు వరుసగా రెండు సిక్సర్లు రుచి చూపెట్టిన వాట్సన్ మూడో బంతికి అతనికే వికెట్ సమర్పించుకున్నాడు. రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కేదార్ జాదవ్ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) టచ్‌లోకి రాకున్నా రైనా పరుగుల వేగాన్ని మాత్రం ఆపలేదు. 10వ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ కొట్టి తర్వాతి ఓవర్‌లో మిశ్రా బౌలింగ్ ఔటయ్యాడు. మూడో వికెట్‌కు 25 పరుగులు జతయ్యాయి. చేయాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఈ దశలో వచ్చిన ధోనీ, జాదవ్ మెల్లగా ఆడారు. 14వ ఓవర్‌లో జాదవ్ ఇచ్చిన క్యాచ్ మిడాన్‌లో ధావన్ జారవిడిచాడు. 24 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ 1 పరుగు, పాల్ 11 పరుగులు ఇచ్చుకోవడంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 11 పరుగులుగా మారింది. చివర్లో ధోనీ తన ట్రేడ్‌మార్క్ సూపర్ ఫినిషింగ్ సిక్సర్ బాదినా 2 పరుగులు కావాల్సిన దశలో రబడ జాదవ్‌ను ఔట్ చేసి ఉత్కంఠ పెంచాడు.

కొత్తగా వచ్చిన బ్రావో (4 నాటౌట్) రెండు బంతులు వృథా చేసినా నాలుగో బంతిని బౌండరీ లైన్ దాటించి విజయ లాంఛనం పూర్తి చేశాడు. ధోనీ, జాదవ్ నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అంతకముందు, ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(51: 47 బంతుల్లో 7ఫోర్లు) అర్థశతకంతో రాణించడంతో ఢిల్లీ ఆమాత్రం స్కోరు సాధించింది. భారీ స్కోరు సాధించాల్సిన సమయంలో బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్‌ పృథ్వీ షా(24) జట్టు స్కోరు 36 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు సహకరించాడు.

కష్టాల్లో ఉన్న జట్టు ఇన్నింగ్స్‌ను వీరిద్దరూ సరిదిద్దారు. కీలక సమయంలో అద్భుతమైన బంతితో శ్రేయాస్‌ను ఇమ్రాన్‌ తాహిర్‌ ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రిషబ్‌ పంత్‌(25) బ్రావో వేసిన భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్‌ వద్ద శార్దుల్‌ ఠాకూర్‌ చేతికి చిక్కాడు. 15.2 ఓవర్లకే 120 పరుగులు చేసి ఢిల్లీ పటిష్ఠస్థితిలో ఉంది. అప్పటికి కేవలం 3 వికెట్లు చేజార్చుకున్న ఢిల్లీ తర్వాతి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ధావన్‌ వేగంగా ఆడే క్రమంలో డ్వేన్‌ బ్రావో వేసిన 18వ ఓవర్‌ తొలి బంతికే వెనుదిరిగాడు. దీంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. మరోవైపు, ఆఖరి ఓవర్లలో చెన్నై బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేశారు.

కీలక సమయాల్లో వికెట్లు తీసి స్కోరు వేగానికి కళ్లెం వేశారు. బ్రావో(3/33) గొప్పగా బంతులేశాడు. దీపక్‌ చాహర్‌, జడేజా, తాహిర్‌ తలో వికెట్‌ తీశారు.