ముంబయి, మార్చి 26 (న్యూస్‌టైమ్): పూర్తి అనుకూల పరిస్థితుల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సోమవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూనే ఊహించిన విధంగా లాభాలు ఆర్జించాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) వంటి సంస్థలు నష్టాలను చవిచూసినప్పటికీ చాలా వరకు మదుపరులు లాభాలు దక్కించుకున్నారు. సెన్సెక్స్‌ 424 పాయింట్లు లాభపడి 38,233 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 వద్ద స్థిరపడ్డాయి.

ముఖ్యంగా స్థిరాస్తి రంగ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ ఐటీ రంగ సూచీ మాత్రం నష్టాల్లో ట్రేడైంది. ఊహించినట్లుగానే టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లే నష్టపోయాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో దాదాపు 9 శాతం పెరిగాయి. నరేష్‌ గోయల్‌ సంస్థ నుంచి దూరంగా జరగడం, ప్రభుత్వ రంగ బ్యాంకులు పెట్టుబడులు పెట్టనుండటంతో షేర్లు పెరిగాయి. మరోపక్క, డీఎల్‌ఫ్‌ షేరు కూడా దాదాపు 7 శాతం పెరిగింది. దాదాపు రూ.3,175 కోట్లు సేకరించేందుకు క్యూఐపీకి వెళ్లనున్నట్లు జెట్‌ ప్రకటించడంతో షేర్లు ర్యాలీ చేశాయి. మరోవైపు, అనిల్ అంబానీ నాయకత్వంలోని ఆర్‌కామ్‌ సంస్థకు చెందిన షేర్లు మరోసారి భారీగా పతనమయ్యాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో దాదాపు 5 శాతం కుంగాయి. ఆర్‌కామ్‌, జియో మధ్య స్పెక్ట్రమ్‌ డీల్‌ను మార్చి 26 తర్వాత డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలోనే షేర్లు పతనమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉదయం 11.10 సమయానికి 4.94 శాతం పతనమై 4.81 వద్దకు చేరింది. ఇప్పటికే ముంబయి సర్కిల్‌లో స్పెక్ట్రం నిమిత్తం చెల్లించాల్సిన రూ.21 కోట్లను పెండింగ్‌లో పెట్టడంపై డీవోటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్లింపులు చేయని వారు వాయు తరంగాలను విక్రయించడం కానీ, పంచుకోవడం కానీ చేయకూడదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఒక వేళ వాయుతరంగాల ఒప్పందాన్ని రద్దు చేస్తే జియోకు 21 సర్కిళ్లలో ఉన్న 850 మెగా హెర్ట్జ్‌ విభాగంలో సర్వీసులపై ప్రభావం పడుతుంది. ఇదిలావుండగా, అమెరికా ట్రెజరీ ‘ఈల్డ్‌ కర్వ్‌’ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరాన్ని సూచిస్తోందని ఫెడరల్‌ రిజర్వు మాజీ ఛైర్‌పర్సన్‌ జానెట్‌ అలెన్‌ తెలిపారు. అంతేకానీ అది సంక్షోభానికి చిహ్నం కాదని పేర్కొన్నారు. క్రెడిట్‌ సూ కాన్ఫరెన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అలెన్‌ 2014 నుంచి 2018 వరకు ఫెడ్‌ బాధ్యతలను నిర్వహించారు. అప్పట్లో ఆమె అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం కూడా సంపాదించారు. అమెరికాలోని ట్రెజరీ బిల్స్‌కు సంబంధించిన ఆదాయాన్ని చూపే రేఖ. ఇది స్వల్పకాల రుణాల నుంచి దీర్ఘకాల రుణాల వరకు ఆదాయాన్ని చూపిస్తుంది. సాధారణంగా దీర్ఘకాల రుణాలపై ఎక్కువ ఆదాయం స్వల్పకాల రుణాలపై తక్కువ ఆదాయం ఉంటుంది. కానీ ప్రస్తుతం దీర్ఘకాలిక రుణాలపై తక్కువ స్వల్పకాల రుణాలపై ఎక్కువ ఆదాయం ఉంది. దీనిని ఇన్వెర్టెడ్‌ ఈల్డ్‌ కర్వ్‌ అంటారు. ఇలా ఉంటే ఆర్థిక సంక్షోభానికి చిహ్నంగా భావిస్తారు. 2007 మధ్యలో ఒక సారి ఇలా జరిగింది. అప్పటి నుంచి ఇటీవల మార్చి 22 వరకు మళ్లీ ఇన్వెర్టెడ్‌ ఈల్డ్‌కర్వ్‌ కనిపించలేదు.