హైదరాబాద్, మార్చి 26 (న్యూస్‌టైమ్): గత ఏడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కేసీఆర్‌కు మంగళవారం నోటీసులు జారీచేసింది. గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం మొదటి అఫిడవిట్‌లో 4 కేసులు మాత్రమే చూపారని పిటీషన్‌దారు పేర్కొన్నారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ తన పిటీషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది.