సిద్ధిపేట, మార్చి 26 (న్యూస్‌టైమ్): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో కంపెన్సేటరీ అఫోర్ స్టేషన్ పనులు వీక్షించేందుకు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె. జోషి చెప్పారు. ప్రాజెక్టు పనులు పూర్తయినప్పటికీ కంపెన్సేటరీ అఫోర్ స్టేషన్ పనులు ముందుకు సాగడం లేదని, సీఎం కేసీఆర్ చెప్పినట్లు వేగవంతంగా ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లుగానే లక్ష్యాలకు అనుగుణంగా కంపెన్సేటరీ అఫోర్ స్టేషన్ పనులను తొందరగా పూర్తి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని మంగళవారం ఇక్కడ తెలిపారు.

జిల్లా అటవీ శాఖ యంత్రాంగం మంచి పని చేస్తున్నదని సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్, అధికార యంత్రాంగాన్ని సీఎస్ అభినందించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ రెండు నెలల ముందుగానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరిత హారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కంపెన్సేటరీ అఫోర్ స్టేషన్ కింద చేపట్టాల్సిన పనులు, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను సందర్శించినట్లు వెల్లడించారు.

జిల్లాలో ప్రతిపాదిత ప్రాంతాలలో అటవీయేతర భూముల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణ భూముల పరిష్కారం చేస్తూనే, జూన్, జూలైకల్లా ప్రతి ఊరికో నర్సరీ ఏర్పాటు చేయడంతో పాటు గతేడాది నాటిన ప్రతి మొక్కను బతికించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు ముందుగా సిద్ధిపేట జిల్లా ములుగు ఫారెస్టులోని నర్సరీ మొక్కల పెంపకాన్ని పీసీసీఎఫ్ పీకే ఝా, ఏపీ పీసీసీఎఫ్ ఆర్ఎం.డోబ్రియాల్, ఏపీ పీసీసీఎఫ్ శోభ, లోకేష్ జైస్వాల్, సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, మెదక్ కన్సర్వేటర్ శ్రవణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ తదితర అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.

ఆ తర్వాత ఫారెస్ట్ హౌసులో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ అటవీకరణ- సీఏ ఫోటో ప్రజంటేషన్ గ్యాలరీ అంశాలను సీఎస్.ఎస్.కే.జోషికి సవివరంగా అటవీ శాఖ అధికారులు వివరించారు. ఆ తర్వాత ప్రతిపాదిత ప్రాంతాలలో అటవీయేతర భూముల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణ భూముల ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ములుగు నర్సరీ నుంచి నర్సంపల్లి 40 హెక్టార్ల అటవీ ప్రాంతం, ఆ తర్వాత దామరకుంట గ్రామంలో గజ్వేల్ రేంజ్ అటవీ శాఖ అధికారి రామారావు 40హెక్టార్లలో చక్కగా రూపుదిద్దిన అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం గౌరారం-నెంటూరులో ఎవెన్యూ ప్లాంటేషన్ ను పనులు పరిశీలించారు. ఆ తర్వాత గజ్వేల్ పట్టణ శివారులో కల్పకవనం అటవీ పార్కును సందర్శించి అక్కడ కాసేపు సేద తీరారు. గజ్వేల్ పట్టణ శివారులో కల్పకవనం అటవీ పార్కులో అతి పురాతనమైన మల్కబావిని సందర్శించి., చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న ఈ బావి గురించి జిల్లా కలెక్టర్ భాస్కర్ సీఎస్. జోషికి వివరించారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ బావికి ఆధునాతన హంగులు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సీఎస్ సూచించారు.

ఈ మేరకు సీఎస్. జోషి తన సెల్ ఫోన్ కెమెరాలో అక్కడి బావి దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామ శివారులోని 403 సర్వే నెంబరులో అటవీకరణ జరిపిన, జరగాల్సిన ప్రతిపాదిత ప్రాంతాలలో అటవీయేతర భూముల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణ భూముల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. రేగులపల్లి గ్రామ అటవీ ప్రాంతంలోని ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు రామారావు, ఇతర ఫారెస్ట్ అధికార యంత్రాంగం, వివిధ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం పాల్గొన్నారు.

1 COMMENT

  1. Hi my family member! I wish to say that this post is amazing, great written and come with approximately all vital infos.
    I’d like to peer extra posts like this .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here