హైదరాబాద్, మార్చి 26 (న్యూస్‌టైమ్): ‘డైలాగ్ కింగ్‌’గా సినీ పరిశ్రమలో పేరుమోసిన డాక్టర్ మంచు మోహన్‌బాబు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో మంగళవారం జగన్‌తో భేటీ అయిన ఆయన పార్టీ తీర్ధంపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్‌బాబుకు పార్టీ కాండువా వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తాను ఏ పదవీ ఆశించి వైఎస్సార్‌సీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుందని మాత్రమే పార్టీలో చేరానని చెప్పారు. నిజంగా పదవులపై వ్యామోహం ఉండుంటే 15 ఏళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఏదో ఒక పదవిలో ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఫీజు రీయిబర్స్‌మెంట్‌ విషయంలో చంద్రబాబునాయుడుతో ఎన్నో సార్లు తాను మాట్లాడానని, ఇప్పటివరకూ తమ విద్యాసంస్థకు సుమారు 19 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అనుకున్న సమయానికి ఇవ్వకపోతే ప్రయివేటు విద్యా సంస్థలు ఎలా నిర్వహించగలుగుతామని మోహన్‌బాబు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మూడు నెలలకోసారి ఇస్తానన్నారని, కానీ ఆ పనీ సక్రమంగా చేయలేకపోయారన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సకాలంలో చెల్లింపులు జరపకపోతే, దాని ప్రభావం వల్ల కొన్ని చాలా కాలేజీల్లో జీతాలివ్వలేకపోవచ్చన్నారు. కానీ తను మాత్రం సొంత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జీతాలిస్తూ వస్తున్నానని తెలిపారు. తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కూడా కదిలించాల్సిన అవసరం వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనప్పుడు సహకరించాలని విద్యార్ధుల తల్లిదండ్రులను పిలిచి చెప్పానని వివరించారు. తమకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ బాకీ లేదని, సక్రమంగానే ఉప్పల్‌లో విద్యా సంస్థ నడుపుతున్నామని, తాను పంచభూతాల సాక్షిగా చెప్తున్నానని, ఈ మాటలు తను ఎవరికో భయపడి చేబుతున్నవి కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి మీదా దాడులు చేయలేదన్నారు. జగన్‌ ఏపీలో స్వీప్‌ చేస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మోహన్‌బాబు జోస్యం చెప్పారు.

చంద్రబాబు వందేళ్లు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నానని, కానీ ఎన్నికల్లో ఓడిపోవాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబంతో మోహన్‌బాబు కుటుంబానికి బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు విష్ణును వైఎస్ సోదరుడి కుమార్తెకు ఇచ్చి వివాహం చేయడంతోనే మోహన్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here