శ్రీకాకుళం, మార్చి 26 (న్యూస్‌టైమ్): ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని, ఆ రెండూ తమకు రెండు కళ్లులాంటివనీ ఆ పార్టీ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అభ్యర్ధి కూన రవికుమార్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అభ్యర్ధి, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులతో కలిసి లోకేశ్ పాల్గొన్నారు.

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన తర్వాత లోకేష్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గడచిన అయిదేళ్లు ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా పని చేసిన తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎంతో ఉత్సాహాన్నిస్తోందన్నారు. తిత్లీ తుఫాన్ ధాటికి నష్టపోయినా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకున్న సత్వర చర్యల వల్ల వెంటనే కోలుకుని తిరిగి అభివృద్ధిబాటలో పయనిస్తున్నామని, ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని అభిప్రాయపడ్డారు. కేవలం అధికార దాహంతో కుట్రలు చేసేవారిని పక్కనపెట్టి అభివృద్ధికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఐదేళ్ల తెదేపా పాలనలో రాష్ట్రాభివృద్ధికే పెద్దపీట వేశామని విద్యుత్తు శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నడిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెదేపా హయాంలోనే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గతంలో పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పనిచేశాయని, కేంద్రంలో మంత్రులుగా చేశారని, పది రూపాయల పనులు విదిల్చలేకపోయారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. పల్లెపల్లెలో ఏ అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకాన్ని అడిగినా సైకిల్‌ పేరే చెబుతుందన్నారు.

గ్రామాల్లో సిమెంటు రహదారులు, వాటికి అనుసంధాన తారు రహదారులు, మురుగు కాలువలు, రక్షిత తాగునీటి పథకాలు, ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకం, బీసీ, ఎస్సీ రుణాలు, విపక్షాలు ఊహించని రీతిలో అడుగడుగునా అభివృద్ధి జరిగిన తరుణంలో మీ ఓటు వేయాలని అభ్యర్థించారు. అయిదేళ్లపాటు చేసిన పనులకు లంచాలు తీసుకున్నానా? అవినీతికి పాల్పడ్డానా? మోసం చేశానా? దగాకు పాల్పడ్డానా? చేసిన అభివృద్ధికి మీ ఓటును కూలి రూపంలో అడుగుతున్నానని పేర్కొన్నారు.

ఈ దఫా జరుగుతున్న ఎన్నికల్లో తనకు పూర్తిస్థాయిలో ఓట్ల రూపంలో మద్దతు పలికిన పల్లెపల్లెలకు పదింతలు అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అంతకముందు మంత్రి లోకేశ్‌ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నప్పుడు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికాయి.